ఓబేదెదోము, అతని కుమారులు. ఓబేదెదోము పెద్ద కుమారుడు షెమయా. యెహోజాబాదు అతని రెండవ కుమారుడు. యోవాహు మూడవవాడు. శాకారు అతని నాల్గవ కుమారుడు. నెతనేలు అయిదవవాడు.
అమ్మీయేలు ఆరవవాడు. ఇశ్శాఖారు అతని ఏడవ కుమారుడు. పెయుల్లెతై అతని ఎనిమిదవ కుమారుడు. దేవుడు నిజంగా ఓబేదెదోమును [*ఓబేదెదోమును ఒడంబడిక పెట్టె అతని ఇంటిలో వున్నప్పుడు, దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించాడు. చూడండి మొదటి దిన.వృ. 21.] ఆశీర్వదించాడు.
మెరారీ వంశానికి చెందిన ద్వారపాలకులు ఎవరనగా, హోసా పెద్ద కుమారునిగా షిమ్రీ పరిగణింపబడ్డాడు. నిజంగా షిమ్రీ పెద్ద కుమారుడు కాదు. కాని అతని తండ్రి అతనిని పెద్దవాడుగా ఆదరించాడు.
ప్రతి కుటుంబానికి ఒక ద్వారం కాపలా కొరకు కేటాయించబడింది. ప్రతి కుటుంబానికీ ద్వారాలు నిర్ణయించటానికి చీట్లు వేయబడ్డాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే భేధం పాటించకుండా అంతా సమంగా చూడబడ్డారు.
చీట్లు వేయగా తూర్పు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. షెలెమ్యా కుమారుడు జెకర్యాకు కూడ చీట్లు వేయబడ్డాయి. జెకర్యా చాలా తెలివైన సలహాదారు. ఉత్తర ద్వారం జెకర్యాకు వచ్చింది.
తూర్పుద్వారం వద్ద ప్రతి రోజూ ఆరుగులు లేవీయులు కాపలా వుండేవారు. ఉత్తర ద్వారం వద్ద ప్రతి రోజూ ఐదుగురు లేవీయులు నిలబడేవారు. దక్షిణ ద్వారం వద్ద నలుగురు లేవీయులు నిలబడేవారు. విలువైన వస్తువులు దాచే ఇంటివద్ద ఇద్దరు లేవీయులు కాపలా వుండేవారు.
షూబాయేలు బంధువుల వివరాలు: ఎలీయెజెరు తరపున అతని బంధువులు ఎవరనగా: ఎలీయెజెరు కుమారుడు రెహబ్యా. రెహబ్యా కుమారుడు యెషయా. యెషయా కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు జిఖ్రీ. జిఖ్రీ కుమారుడు షెలోమీతు.
షెలోమీతు, అతని బంధువులు కలిసి దీర్ఘదర్శియగు (ప్రవక్త) సమూయేలు, రాజైన సౌలు, నేరు కుమారుడగు అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి సంరక్షణ బాధ్యత కూడా వహించారు. షెలోమీతు, అతని బంధువులు యెహోవాకు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి విషయంలో జాగ్రత్త వహించారు.
కెనన్యా ఇస్హారు కుటుంబంలోని వాడు. కెనన్యా, అతని కుమారులు మందిరపు బయట బాధ్యతలు స్వీకరించారు. వారు రక్షకభటులుగాను, న్యాయాధిపతులుగాను ఇశ్రాయేలులో వివిధ ప్రాంతాలలో పని చేశారు.
హషబ్యా హెబ్రోను కుటుంబంలోని వాడు. హషబ్యా, అతని బంధువులు దేవుని అన్ని కార్యాలలోను; యోర్దాను నదికి పశ్చిమానగల ఇశ్రాయేలులో రాజుగారి పనులలోను శ్రద్ధ తీసుకొనే వారు. హషబ్యా వర్గంలో పదిహేడువేల మంది బలవంతులున్నారు.
వారికి యెరీయా పెద్ద అని హెబ్రోను కుటుంబ చరిత్ర తెలుపుతుంది. దావీదు నలుబది ఏండ్లు రాజుగా వున్న కాలంలో తన ప్రజల వంశ చరిత్రలు చూచి బలపరాక్రమాలుగల వారిని, నేర్పరులైన పనివారిని వెదుకమని ఆజ్ఞాపించాడు. అట్టివారిలో కొంతమంది గిలియాదులో గల యాజేరు పట్టణంలో నివసిస్తున్న హెబ్రోను వంశీయులలో వున్నట్లు కనుగొన్నారు.
యెరీయాకు రెండువేల ఏడువందల మంది బలవంతులైన, కుటుంబ పెద్దలైన బంధువులున్నారు. యెహోవా కార్యాలు చేయటంలోను, రాజు పనులు చక్కబెట్టటం లోను రూబేనీయుల, గాదీయుల మరియు మనష్షే సగం వంశీయుల పనిని పరిశీలించేందుకు రాజైన దావీదు యెరీయా బంధువులైన ఆ రెండువేల ఏడువందల మందిని నియమించాడు.