దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు.
ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు.
వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణాసితార వాద్యాలను వాయించేవారు.
“మా సంరక్షకుడవగు ఓ దేవా! మమ్ములను రక్షింపుము! మమ్ము ఒక దగ్గరికి చేర్చి మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము. అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము. మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి.
ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెండ్రి పేరు యెదూతూను.
దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు.
హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక.
హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు.