గతంలో మమ్మల్ని నీవు యుద్ధంలో నడిపించావు. సౌలు రాజుగా వున్నప్పటికీ మమ్మల్ని నడిపిన వాడవు నీవే! యెహోవా నీతో, ‘దావీదూ, ఇశ్రాయేలీయులైన నా ప్రజల కాపరివి నీవే. నా ప్రజలకు నీవు నాయకుడివవుతావు’ అని అన్నాడు.”
ఇశ్రాయేలు పెద్దలంతా హెబ్రోను పట్టణంలో దావీదు రాజువద్దకు వచ్చారు. యెహోవా సన్నిధిలో ఆ పెద్దలతో దావీదు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. పెద్దలు దావీదు తలమీద నూనె పోసి అభిషిక్తుని చేశారు. ఆ పని దావీదు ఇశ్రాయేలు రాజు అయినట్లు తెలుపుతుంది. ఇది జరుగుతుందని యెహోవా మాటయిచ్చాడు. ఈ వాగ్దానం యెహోవా సమూయేలు ద్వారా చేశాడు.
దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యెరూషలేముకు వెళ్లారు. ఆ కాలంలో యెరూషలేము “యెబూసు” అని పిలువబడేది. ఆ నగరంలో నివసించే ప్రజలంతా యెబూసీయులనబడేవారు. ఆ నగరవాసులు
దావీదుతో, “నీవు మా నగర ప్రవేశం చేయకూడదు” అని అన్నారు. అయినప్పటికి దావీదు ఆ ప్రజలను ఓడించాడు. సీయోను కొండ [*సీయోను కొండ యెరూషలేము నగరం కట్టబడిన ఒక కొండ పేరు.] మీది కోటను దావీదు వశం చేసుకొన్నాడు. ఈ ప్రదేశమే దావీదు నగరమని పిలువబడింది.
“మీలో ఎవరు సైన్యాన్ని యెబూసీయుల మీదికి విజయవంతంగా నడిపిస్తారో అతడు నా సైన్యానికంతటికి ముఖ్య అధిపతి అవుతాడు” అని దావీదు ప్రకటించాడు. అది విని యోవాబు దండయాత్రకు నాయకత్వం వహించి నిర్వహించాడు. యోవాబు తండ్రిపేరు సెరూయా. యోవాబు సైన్యాధిపతయ్యాడు.
కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లో [†మిల్లో పాత యెరూషలేములో ఒక భాగం. బైబిలు విద్యార్థులు దీనిని ఒక సమావేశ స్థలంగానో, లోయగానో, లేక నీటి వనరుగల ప్రదేశంగానో పరిగణించవచ్చు.] నుండి బయటి ప్రాకారం వరకు అతడు నగరాన్ని నిర్మించాడు. యోవాబు ఆ నగరంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయించాడు.
దావీదు సైన్యంలో మహావీరులున్నారు. దావీదులాగానే వీరుకూడా శక్తిమంతులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలంతా దావీదు రాజ్యానికి మంచి మద్దతు ఇచ్చారు. ఈ మహావీరులూ, ఇశ్రాయేలు ప్రజానీకం కలసి దావీదును రాజుగా చేశారు. దేవుడు ఇది జరుగుతుందని వాగ్దానం చేశాడు.
దావీదు సైన్యంలో మహాయోధులు ఎవరనగా: హక్మనీయులకు చెందిన యాషాబాము ఒకడు. యాషాబాము అధికారులకు పై అధికారి. [‡యాషాబాము … అధికారి దీని అర్థం ముప్పదిమంది కావచ్చు. చూడండి సమూయేలు రెండవ గ్రంథం. 23:8.] అతడు తన ఈటెనుపయోగించి మూడు వందల మందిని ఎదిరించాడు. ఆ మూడువందల మందిని ఒక్క వేటుతో చంపివేశాడు.
పస్దమ్మీములో ఎలియాజరు దావీదుతో వున్నాడు. ఫిలిష్తీయులు ఆ ప్రదేశానికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఆ ప్రాంతంలో విరగపండిన యవల చేనువుంది. ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశానికి పారిపోయి వచ్చారు.
ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు.
దావీదుకు అప్పుడు దాహం వేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు నాకెవరైనా బేత్లెహేము [§బేత్లెహేము బేత్లెహేము దావీదు స్వంత పట్టణం. అందువల్ల ఆ ఊరి బావినుండి నీళ్లు తాగాలని దావీదు కోరుకున్నాడు.] నగర ద్వారం వద్దగల బావి నీరు తాగటానికి తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను!” (దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు.
అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని యెహోవాకి అర్పణగా పారపోశాడు.
దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మనుష్యులు ఈ నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు.
యోహోయాదా కుమారుడు బెనాయా ఒక పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్సెయేలు వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెరవేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది బాగా మంచుపడే రోజున జరిగింది.
ఈజిప్టుకు చెందిన బలవంతుడైన సైనికుని కూడ బెనాయా చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల వాడు. ఆ ఈజిప్టు వాని వద్ద అతి పెద్దదయిన, బరువైన ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవలె వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని వద్ద నుండి ఈటెను లాక్కున్నాడు. దానితోనే వానిని చంపివేశాడు.