నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.
మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను.
విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.
కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును
వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రిక లతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.
ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును
ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును.
దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.
ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.
వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవు చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు.
యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.
గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను
నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.
కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను.