మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసు లగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తె లలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా
అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.
ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని.
అందుకు వారునీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.
మరియు నేను నా ఒడిని దులిపిఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింప కయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపి వేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాట చొప్పుననే జరిగించిరి.
మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరము వరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు.
అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.
నా నిమిత్తము ప్రతి దినము ఒక యెద్దును శ్రేష్ఠమైన ఆరు గొఱ్ఱలును సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను, పదిరోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు.