అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ!
ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు!
దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి.
ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందిన వాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందిన వాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందిన వాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందిన వాళ్ళు ఆనందంగా దయ చూపాలి.
మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో, “పగ తీర్చుకోవటం నా వంతు. నేను ప్రతీకారం తీసుకొంటాను” ద్వితియోపదేశ 32:35 అని వ్రాయబడి ఉంది.
దానికి మారుగా, “మీ శత్రువు ఆకలితో ఉంటే అతనికి ఆహారం ఇవ్వండి. అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి. ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది” సామె. 25:21-22 అని వ్రాయబడివుంది.