దహనబలి అర్పణలు వారు ఎక్కడ వధిస్తారో అక్కడే అపరాధ పరిహారార్థ బలులను కూడా యాజకుడు వధించాలి. అంతట యాజకుడు అపరాధ పరిహారార్థ బలి రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
రెండు మూత్ర గ్రంథులను, వాటిమీద కొవ్వును, నడుందగ్గరి కొవ్వును, కార్జం యొక్క కొవ్విన భాగాన్ని అతడు అర్పించాలి. దానిని మూత్ర గ్రంథులతో బాటు అతడు తీసివేయాలి.
ధాన్యార్పణ పెట్టే యాజకునికే ప్రతి ధాన్యార్పణ చెందుతుంది. పొయ్యిమీద వండిన ప్రతి ధాన్యార్పణ, పాత్రలోగాని, పెనంమీదగాని వండిన ప్రతి ధాన్యార్పణ ఆ యాజకునిదే అవుతుంది.
ఆ వ్యక్తి తన కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు సమాధాన బలులు తేవచ్చును. కృతజ్ఞతలు చెల్లించేందుకు అతడు తన బలిని తీసుకొని వచ్చినట్లయితే, నూనెతో కలుపబడిను పులియని రొట్టెలను, నూనె పూసిన పొంగని అప్పడాలు, నూనెకలిపి కాల్చబడిన గోధుమ పిండివంటలు అతడు అర్పించాలి.
సమాధాన బలితో బాటు, పులియని రొట్టెలనుగూడ అతడు అర్పణగా తీసుకొనిరావాలి. ఇది ఒకడు తన కృతజ్ఞతను దేవునికి తెలియజేసేందుకు తీసుకొని రావాల్సిన అర్పణను గూర్చిన విధి.
ఈ సమాధాన బలి అర్పించిన రోజునే దాని మాంసం తినివేయాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఒక పద్ధతిగా ఒకడు కానుక అర్పిస్తాడు. కాని దాని మాంసంలో ఏమీ మర్నాటి ఉదయం వరకు మిగిలి ఉండకూడదు.
“ఒక వ్యక్తి కేవలం దేవునికి ఒక కానుకగా మాత్రమే సమాధాన బలిని తేవచ్చును. లేక ఒక వ్యక్తి దేవునికి ఒక ప్రత్యేక వాగ్దానం చేసుకొని ఉండొచ్చు. అదే నిజ మైతే ఆ బలిని అర్పించిన రోజునే దాన్ని తినివేయాలి. ఒకవేళ ఏమైనా మిగిలితే, మర్నాడు దాన్ని తినివేయాలి.
సమాధాన బలిలోని మాంసాన్ని ఎవరైనా మూడో రోజున తింటే. ఆ వ్యక్తి విషయంలో యెహోవా సంతోషించడు. ఆ బలిని అతని పక్షంగా యెహోవా లెక్కించడు. ఆ బలి ఆపవిత్రం అవుతుంది. ఆ మాంసంలో ఏదైనా తిన్నవాడు తన పాపానికి తానే బాధ్యుడవుతాడు.
“ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అపవిత్రమైన దాన్ని ముట్టవచ్చు. అది మనుష్యులచేత అపవిత్రం చేయబడిందే కావచ్చు లోక అపవిత్రమైన జంతువు కావచ్చు లేక అసహ్యకరమైన అపవిత్రత కావచ్చును. అలాంటివాడు అపవిత్రుడు. యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం అతడు తిన్నట్లయితే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుండి వేరు చేయాలి.”
కానుకలోని ఆ భాగాన్ని హోమంగా కాల్చాలి. ఆ కానుకను అతడు స్వయంగా తన చేతుల్తో తీసుకొని రావాలి. ఆ జంతువు బోరమీదనున్న కొవ్వును, బోరను యాజకుని దగ్గరకు అతడు తీసుకొని రావాలి. ఆ బోర యెహోవా ఎదుట పైకి ఎత్తబడుతుంది. ఇదే ఆ నైవేద్యము.
నైవేద్యంలోని బోరను, సమాధాన అర్పణలోని కుడి తొడను ఇశ్రాయేలు ప్రజలనుండి నేను తీసుకొని, అహరోనుకు, మరియు అతని కుమారులకు నేను వాటినిస్తున్నాను. ఇది ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వతమైన విధి.”
యెహోవాకు అగ్నిచేత అర్పించబడు అర్పణల్లో, ఆ భాగాలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతాయి. అహరోనుకు, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా పని చేసినప్పుడు బలి అర్పణల్లో వారికి కొంతభాగం లభిస్తుంది.
యెహోవా, యాజకులను అభిషేకించినప్పుడే ఈ విషయాన్ని చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆ భాగాలను యాజకులకు ఇవ్వవలెను. వారి తరాలన్నింటిలో శాశ్వతంగా వారు ఆ భాగాలను యాజకులకు ఇవ్వాలి.
సీనాయి పర్వతంమీద మోషేకు యెహోవా వాటిని ఇచ్చాడు. సీనాయి ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు వారి అర్పణలు తీసుకొని రావాలని ఆయన ఆజ్ఞాపించిన రోజునే ఈ విధులను యెహోవా ఇచ్చాడు.