“ఒకడు యిలాంటి పాపాలు చేసి, యెహోవాకు విరోధంగా అపరాధం చేయవచ్చు, ఒక వ్యక్తి మరొకరి పక్షంగా దేనికైనా కాపలా కాస్తూండగా దానికి జరిగిన దాన్ని గూర్చి అతడు అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు తాను చేసిన ప్రమాణం విషయంలో అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు దేనినైనా దొంగిలించవచ్చు, లేక ఎవర్నయినా మోసం చేయవచ్చు,
లేక ఒకడు పోయింది దొరికినప్పుడు దాన్ని గూర్చి అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు ఏదో చేస్తానని వాగ్దానం చేసి తర్వాత అతడు వాగ్దాన ప్రకారం చేయకపొవచ్చు, లేక ఒకడు ఇంకేదైనా చెడుకార్యం చేయవచ్చు.
ఒక వ్యక్తి వీటిలో ఏదైనా చేస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. అతడు దొంగతనంగా తీసుకొన్నదిగాని, మోసంచేసి తీసుకొన్నదిగాని, మరోవ్యక్తి భద్రంగా ఉంచమని ఇవ్వగా అతడు తీసుకొన్నదిగాని, దొరికినా అబద్ధం చెప్పి దాన్ని, లేక
దేన్ని గూర్చి అతడు అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని అతడు తిరిగి ఇచ్చిచేయాలి. దాని పూర్తివిలువను అతడు చెల్లించాలి. తర్వాత దాని విలువలో అయిదోవంతు అదనంగా అతడు చెల్లించాలి. దాని అసలైన సోంతదారునికి అతడు ఆ మొత్తాన్ని ఇవ్వాలి. అతడు తన అపరాధ పరిహారార్థ బలి తెచ్చిననాడే దీన్ని చెల్లించాలి.
ఆ వ్యక్తి అపరాధ పరిహారార్థ బలిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. అది మందలోనుంచి తెచ్చిన పొట్టేలు. ఆ పొట్టేలుకు ఏదోషమూ ఉండకూడదు. అది యాజకుడు నిర్ణయించిన ధరకు తగినదిగా ఉండాలి. అది యెహోవాకు అపరాధ పరిహారార్థ బలి.
“అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు. ఇది దహనబలి అర్పణ నియమము. రాత్రి అంతా, తెల్ల వారేవరకు దహనబలి అర్పణ బలిపీఠం మీద దహనం అవుతూనే ఉండాలి. బలిపీఠం మీద బలిపీఠపు అగ్ని మండుతూనే ఉండాలి.
యాజకుడు తన మేలురకపు అంగీని ధరించాలి. అతడు తన మేలు రకపు చెడ్డీని వేసుకోవాలి. తర్వాత బలిపీఠం మీద దహనబలిని అగ్ని దహించగా మిగిలిన బూడిదను అతడు తీసుకోవాలి. ఈ బూడిదను యాజకుడు బలిపీఠం పక్కగా పోయాలి.
అయితే బలిపీఠపు అగ్నిని మాత్రం బలిపీఠం మీద మండుతూ ఉండనివ్వాలి. దానిని ఆరిపోనివ్వ కూడదు. ప్రతి ఉదయం బలిపీఠం మీద యాజకుడు కట్టెలను కాల్చుతూఉండాలి. బలిపీఠం మీద అతడు కట్టెలు పేర్చాలి. సమాధాన బలుల కొవ్వును అతడు దహించాలి.
ధాన్యార్పణలోనుంచి పిడికెడు మంచి పిండిని యాజకుడు తీసుకోవాలి. ధాన్యార్పణ మీద నూనె, సాంబ్రాణి ఉండాలి. ధాన్యార్పణాన్ని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది ఇష్టమైన సువాసనగాను, యెహోవాకు జ్ఞాపకార్థ అర్పణగాను ఉంటుంది.
“మిగిలిపోయిన ధాన్యార్పణాన్ని అహరోను, అతని కుమారులు తినాలి. ధాన్యార్పణ పొంగని రొట్టెలా ఉంటుంది. యాజకులు ఈ రొట్టెను పవిత్ర స్థలంలో తినాలి. సన్నిధి గుడారపు ఆవరలో వారు ఈ ధాన్యార్పణను తినాలి.
ధాన్యార్పణను పులిసిన పదార్థం లేకుండా చేయాలి. అగ్నిద్వారా నాకు అర్పించబడిన అర్పణల్లో అది వారి భాగంగా నేను దానిని ఇచ్చాను. పాపపరిహారార్థ బలిలా, అపరాధ పరిహారార్థ బలి అర్పణలా అది కూడ అతి పవిత్రం.
యెహోవాకు అగ్నిద్వారా అర్పించబడిన అర్పణల్లోనుంచి అహరోను మగ సంతానం అందరూ తినవచ్చును. మీ తరాలన్నింటికీ ఇది శాశ్వత నియమము. ఈ అర్పణలస్పర్శ వారిని పవిత్రులను చేస్తుంది.”
“అహరోను, అతని కుమారులు యెహోవాకు తీసుకొని రావాల్సిన అర్పణలు ఇవి. అహరోను అభిషేకించబడిన రోజున వారు ఇలా చేయాలి. తూమెడు మంచి పిండిలో పదోవంతు వారు ఎల్లప్పుడూ ధాన్యార్పణగా తీసుకొనిరావాలి. అందులోనుంచి సగం ఉదయం, సగం సాయంత్రం వారు తీసుకొని రావాలి.
మంచి పిండిని నూనెతో కలిపి, పెనం మీద దాన్ని చేయాలి. అది ఉడికిన తర్వాత దానిని మీరు లోనికి తీసుకొని రావాలి. ధాన్యార్పణాన్ని మీరు భాగాలుగా చేయాలి. దానిని మీరు యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.
“అహరోను, తర్వాత అతని సంతానంవారు ఎవరైతే అహరోను స్థానంలో అభిషేకించబడతారో వారు ఈ ధాన్యార్పణాన్ని యెహోవాకు పెట్టాలి. ఇది శాశ్వత నియమము, ధాన్యార్పణాన్ని యెహోవాకు పూర్తిగా దహించాలి.
“అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు: పాప పరిహారార్థ అర్పణ విధి ఇది. యెహోవా ఎదుట దహనబలి పశువు వధించబడే చోటనే పాపపరిహారార్థ బలి పశువుకూడ అర్పించ బడాలి. అది అతి పరిశుద్ధం.
పాప పరి హారార్థబలి మాంసాన్ని తాకిన ప్రతి ఒక్కడూ పరిశుద్ధుడవుతాడు. మరియు తాకిన ప్రతి వస్తువూ పరిశుద్ధం అవుతుంది. “చిలకరించబడిన రక్తం ఏ బట్టలమీద పడినా, మీరు ఆ బట్టలను ఉతకాలి. పరిశుద్ధ స్థలంలో మీరు ఆ బట్టలను ఉతకాలి.
పాపపరిహారార్థ బలి గనుక మట్టి పాత్రలో ఉడకబెడితే ఆ పాత్రను పగుల గొట్టివేయాలి. పాపపరిహారార్థ బలిని ఇత్తడి పాత్రలో ఉడకబెడితే ఆ పాత్రను తోమి, నీళ్లతో కడగాలి.
కానీ పాపపరిహారార్థ బలి రక్తాన్ని గనుక పరిశుద్ధస్థలాన్ని శుద్ధి చేసేందుకని సన్నిధి గుడారంలోనికి తీసుకొని వెళ్తే, అప్పుడు ఆ పాపపరిహారార్థ బలిని అగ్నిలో కాల్చి వేయాలి. ఆ పాపపరిహారార్థ బలిని యాజకులు తినకూడదు.