“ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇచ్చే దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు అక్కడ పంటలు కోస్తారు. ఆ సమయంలో మీ పంటలోని ప్రథమ పనను యాజకుని దగ్గరకు మీరు తీసుకొని రావాలి.
ఒలీవ నూనెతో కలిపిన రెండు పదోవంతుల పిండిని ధాన్యార్పణగా మీరు అర్పించాలి. ముప్పావు ద్రాక్షారసమును కూడా మీరు అర్పించాలి. ఆ అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన.
దేవునికి ఆ అర్పణలు చెల్లించేవరకు, కొత్త ధాన్యంగాని, ఫలాలుగాని, లేక కొత్త ధాన్యంతో చేయబడిన రొట్టెగాని మీరు తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా సరే మీ తరాలన్నింటినీ ఈ ఆజ్ఞ కొన సాగుతుంది.
ఆ రోజున మీ యిండ్ల నుండి రెండు రొట్టెలు తీసుకొని రండి. ఆ రొట్టె నైవేద్యంకోసం. 4 పావులు గోధుమ పిండిలో, పులిసిన పదార్థం ఉపయోగించి ఆ రొట్టెలు తయారుచేయాలి. అది మీ ప్రథమ పంటల్లోనుంచి మీరు యెహోవాకు అర్పించే కానుక.
“ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను ఒక పొట్టేలును, ఏడాది పోతును, ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. అవి యెహోవాకు దహనబలి అర్పణ. అవి హోమంగా అర్పించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా ఉంటాయి.
“నైవేద్యంగా ప్రథమ ఫలంలోని రొట్టెతో పాటు వాటిని, రెండు గొర్రెపిల్లలను యెహోవా ఎదుట యాజకుడు అల్లాడించాలి. అవి యెహోవాకు పవిత్రమైనది. అవి యాజకునికి చెందుతాయి.
“మరియు, మీరు మీ పొలంలో పంట కోసేటప్పుడు పొలం అంచులమట్టుకు కోసి వేయవద్దు. నేలమీద పడే కంకులు ఏరుకోవద్దు. పేదవారికోసమూ, మీ దేశం గుండా ప్రయాణించే విదేశీయుల కోసమూ వాటిని విడిచిపెట్టండి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి!”
“ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు ఏడవ నెల మొదటి రోజున మీకు ప్రత్యేకమైన విశ్రాంతి రోజు ఉండాలి. అప్పుడు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ప్రత్యేక జ్ఞాపకార్థ సమయంగా మీరు బూర ఊదాలి.
ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఎందు చేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజకులు యెహోవా ఎదుటికి వెళ్లి, మిమ్మల్ని పవిత్రం చేసే ఆచారక్రమాన్ని జరిగిస్తారు.
అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”
ఏడు రోజులు యెహోవాకు హోమార్పణలు మీరు అర్పించాలి. ఎనిమిదో రోజు మీకు మరో పవిత్ర సమావేశం జరుగుతుంది. మీరు యెహోవాకు హోమార్పణలు అర్పించాలి. ఇది పవిత్ర సమావేశంగా ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు.
“అవి యెహోవా ప్రత్యేక పండుగలు. ఆ పండుగల్లో పవిత్ర సమావేశాలు జరుగుతాయి. అర్పణలు, బలి అర్పణలు, పానార్పణలు, దహనబలులు, ధాన్యార్పణలు మీరు యెహోవాకు తీసుకొని రావాల్సిన హోమార్పణలు. ఆ కానుకలు తగిన సమయంలో మీరు తీసుకొని రావాలి.
యెహోవా సబ్బాతు రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు ఈ పండుగలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు అర్పించే మీ ఇతర అర్పణలుగాక ఈ కానుకలు అర్పించాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్పించే అర్పణలు గాక వీటిని మీరు అర్పించాలి. మీరు యెహోవాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు ఇవ్వాలి.
“ఏడువ నెల పదిహేనొవ రోజున, దేశంలో మీరు పంటలు కూర్చుకొన్నప్పుడు, యెహోవా పండుగను ఏడు రోజుల పాటు మీరు ఆచరించాలి. మొదటి రోజున, ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి.
మొదటి రోజు పండ్ల చెట్లనుండి మంచి పండ్లు మీరు కూర్చాలి. ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల దగ్గరి నిరవంజి చెట్లు మీరు తీసుకోవాలి. మీ యెహోవా దేవుని ఎదుట ఏడు రోజులు మీరు పండుగ ఆచరించాలి.
ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి నేను బయటకు తీసుకొని వచ్చినప్పుడు, తాత్కాలిక గుడారాల్లో నేను వారిని నివసింపజేసానని మీ సంతానం అంతా తెలుసుకోవాలి. నేను మీ దేవుడనైన యోహోవాను!”