ఇశ్రాయేలు ప్రజలంతా షిలోహు అనే ప్రాంతంలో సమావేశం అయ్యారు. అక్కడ సన్నిధి గుడారాన్ని [*సన్నిధి గుడారం దేవుని దర్శించేందుకు ఇశ్రాయేలీయులు అక్కడికి వెళ్తుండేవారు.] వారు నిలబెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని వారి ఆధీనంలో ఉంచుకొన్నారు. ఆ దేశంలోని శత్రువులందరినీ వారు ఓడించారు.
కనుక ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు, “మీ దేశాన్ని తీసుకొనేందుకు మీరెందుకు ఇంత కాలం చూస్తూ ఊరకున్నారు. మీ తండ్రుల దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు.
కనుక మీ వంశాల్లో ఒక్కోదాని నుండి ముగ్గురు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దేశాన్ని పరిశీలించి చూచేందుకు నేను ఆ మనుష్యుల్ని బయటకు పంపిస్తాను. ఆ దేశ పటాన్ని వారు తయారు చేస్తారు. తర్వాత వారు తిరిగి నా దగ్గరకు వస్తారు.
అయితే మీరు పటం గీసి, దేశాన్ని ఏడు భాగాలుగా విభజించాలి. ఆ పటాన్ని నా దగ్గరకు తీసుకొని రండి, ఏ వంశానికి ఏ భూమి రావాలో అది మనం యెహోవా దేవుడినే నిర్ణయం చేయనిద్దాం.
కానీ లేవీ ప్రజలకు మాత్రం ఈ భూముల్లో ఎలాంటి భాగమూ ఉండదు. వారు యాజకులు, వారి పని యెహోవాను సేవించటమే. గాదు, రూబేను, మనష్షే వంశాలలో సగం మంది వారికి వాగ్దానం చేయబడిన దేశాన్ని ఇదివరకే తీసుకొన్నారు. వారు యోర్దాను నదికి తూర్పు వైపున ఉన్నారు. యెహోవా సేవకుడు మోషే ఇదివరకే వారికి ఆ దేశాన్ని ఇచ్చాడు.”
కనుక ఏర్పాటు చేయబడిన మనుష్యులు ఆ దేశంలో ప్రవేశించటం మొదలు పెట్టారు. ఆ దేశం యొక్క వివరాలను తయారు చేసి, వాటిని యెహోషువ దగ్గరకు తీసుకొని రావాలి అనేది వారి పథకం. కనుక యెహోషువ, “వెళ్లి దేశాన్ని పరిశీలించి, దాని వివరాలు తయారు చేయండి. అప్పుడు తిరిగి నా దగ్గరకు రండి. అప్పుడు మీకు ఏ భూమి రావాలి అనేది నేను నిర్ణయించేందుకు సహాయం చేయాల్సిందిగా యెహోవాను అడుగుతాను. ఇది మనం ఇక్కడ షిలోహులో చేద్దాం” అని వారితో చెప్పాడు.
కనుక ఆ మనుష్యులు ఆ చోటు విడిచి ఆ దేశంలో ప్రవేశించారు. ఆ మనుష్యులు ఆ దేశాన్ని పరిశీలించి, యెహోషువ కొరకు పటాలు తయారుచేసారు. ప్రతి పట్టణాన్నీ వారు పరిశీలించి, దేశం ఏడు భాగాలు అయ్యేటట్టు చేసారు. వారు ఆ పటాలు తయారుచేసి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. యెహోషువ ఇంకా షిలోహులోని పాళెములోనే ఉన్నాడు.
యూదాకు యోసేపుకు మధ్యగల ప్రాంతంలోని దేశం బెన్యామీను వంశానికి ఇవ్వబడింది. బెన్యామీను వంశంలోని ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది. బెన్యామీనుకు నిర్ణయించబడిన భూమి ఇది:
ఉత్తర సరిహద్దు యోర్దాను నది దగ్గర మొదలయింది. యెరికో ఉత్తరపు అంచున కొనసాగింది ఆ సరిహద్దు. తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన కొండ దేశంలోనుండి వెళ్లింది. బెత్ అవెనుకు సరిగ్గా తూర్పున చేరేంతవరకు ఆ సరిహద్దు కొనసాగింది.
తర్వాత ఆ సరిహద్దు లూజుకు (బేతేలు) దక్షిణంగా విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు అతారోతు అద్దారుకు వెళ్లింది. దిగువ బెత్ హరానుకు దక్షిణాన కొండమీద ఉంది అతారోత్ అద్దార్.
బెత్హరానుకు దక్షిణంగా ఒక కొండ ఉంది. ఈ కొండ దగ్గర ఆ సరిహద్దు మళ్లుకొని కొండ పడమటి పక్కకు దగ్గర్లో దక్షిణంగా వెళ్లింది. ఆ సరిహద్దు కిర్యత్ బాలాకు (కిర్యత్యారం) పోయింది. ఇది యూదా ప్రజలు నివసించిన ఒక పట్టణం. ఇది పడమటి సరిహద్దు.
తర్వాత బెన్హిన్నోము లోయ దగ్గర కొండ మట్టానికి ఆ సరిహద్దు విస్తరించింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తర దిశ. ఆ సరిహద్దు యెబూసు పట్టణానికి దక్షిణంగా హిన్నోము లోయగుండా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు ఎన్రోగెలుకు విస్తరించింది.
అక్కడ ఆ సరిహద్దు ఉత్తరంగా మళ్లి ఎన్షెమెషుకు పోయింది. ఆ సరిహద్దు గెలిలోతుకు (పర్వతాల్లోని అదుమీము కనుమ దగ్గర ఉంది గెలిలోతు) కొనసాగింది. ఆ సరిహద్దు రూబేను కుమారుడు బోహను కోసం పేరుపెట్టబడిన మహాశిలవరకు క్రిందికి విస్తరించింది.
తర్వాత ఆ సరిహద్దు బెత్హోగ్లా ఉత్తర ప్రాంతంవరకు వెళ్లి, ఉప్పు సముద్రపు ఉత్తర తీరాన ముగిసింది. ఇక్కడే యోర్దాను నది సముద్రంలో పడుతుంది. అది దక్షిణ సరిహద్దు.
సేలా, ఎలెపు, యెబూసీ పట్టణం (యెరుషలేము), గిబియా, కిర్యత్ ఉన్నాయి. ఇవి పద్నాలుగు పట్టణాలు, వీటి దగ్గర్లో ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ బెన్యామీను వంశానికి లభించిన భూములు.