Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Joshua Chapters

Joshua 11 Verses

Bible Versions

Books

Joshua Chapters

Joshua 11 Verses

1 జరిగిన ఈ సంగతులు అన్నింటిని గూర్చి హాసోరు రాజు యాబిను విన్నాడు. అందుచేత అతడు అనేకమంది రాజుల సైన్యాలను సమకూర్చాలని నిర్ణయించాడు. మదోను రాజైన యోబాబు, షిమ్రోను రాజు, అక్షపు రాజు,
2 ఉత్తరాన కొండదేశం, ఎడారి రాజులు ఇద్దరికి యాబిను సందేశం పంపించాడు. కిన్నెరెత్, నెగెవ్, పడమటి దిగువ కొండల రాజులకు యాబిను సందేశం పంపించాడు. పడమట నఫోత్‌దార్ రాజుకుగూడ యాబిను సందేశం పంపించాడు.
3 యాబిను ఆ సందేశాన్ని తూర్పు, పడమరలలో ఉన్న కనానీ ప్రజల రాజులకు పంపించాడు. కొండ ప్రదేశాల్లో నివసిస్తున్న అమోరీ ప్రజలకు, హిత్తీ ప్రజలకు, పెరిజ్జీ ప్రజలకు, యెబూసీ ప్రజలకు పంపించాడు. మిస్పా ప్రాంతంలో హెర్మోను కొండ దిగువలో నివసిస్తున్న హివ్వీ ప్రజలకుగూడ అతడు ఆ సందేశం పంపించాడు.
4 కనుక ఈ రాజులందరి సైన్యాలు కూడి వచ్చాయి. అక్కడ ఎంతోమంది శూరులు ఉన్నారు, ఎన్నో రథాలు, ఎన్నో గుర్రాలు ఉన్నాయి. అది అతి విస్తారమైన సైన్యం. సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నట్టున్నారు.
5 ఈ రాజులంతా మెరోము అనే చిన్న నది దగ్గర సమావేశ మయ్యారు. వారు తమ సైన్యాలను ఒకే చోటచేర్చారు. ఇశ్రాయేలీయుల మీద పోరాడేందుకు వారు ఏర్పాట్లు చేసారు.
6 అప్పుడు యెహోవా, “ఆ సైన్యాన్ని చూచి భయపడకు. రేపు ఈ వేళకు మీరు ఆ సైన్యాన్ని ఓడించేటట్టు నేను చేస్తాను. వాళ్లందరినీ మీరు చంపేస్తారు. మీరు వారి గుర్రాల కుడికాళ్ల నరాలను నరికివేసి, వారి రథాలను తగులబెట్టేస్తారు” అని యెహోషువతో చెప్పాడు.
7 యెహోషువ, అతని సర్వసైన్యం శత్రువును ఆశ్చర్యచకితులుగా చేసారు. మెరోము నది వద్ద వారు శత్రువుమీద దాడి చేసారు.
8 ఇశ్రాయేలీయులు వారిని ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఇశ్రాయేలీయులు వారిని ఓడించి, మహా సీదోను, మిస్రెపోత్మాయిము, తూర్పున మిస్పాలోయ వరకు వారిని తరిమివేసారు. శత్రువులలో ఒక్కరుకూడ బతకకుండా చచ్చేవరకు ఇశ్రాయేలు సైన్యం పోరాడింది.
9 యెహోషువ ఏమి చేయాలని యెహోవా చెప్పాడో అతడు అలాగే చేసాడు-యెహోషువ వారి గుర్రాల కుడికాళ్ల నరాలను తెగగొట్టి, వారి రథాలను కాల్చివేసాడు.
10 అప్పుడు యెహోషువ వెనుకకు వెళ్లి హసోరు పట్టణాన్ని పట్టుకొన్నాడు. హసోరు రాజును యెహోషువ చంపివేసాడు. (ఇశ్రాయేలీయుల మీద యుద్ధంచేసిన రాజ్యాలన్నింటికీ హసోరు నాయకుడు)
11 ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు సైన్యం చంపేసింది. వారు ఆ ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేసారు. ప్రాణంతో ఏదీ విడువబడలేదు. అప్పుడు వారు ఆ పట్టణాన్ని కాల్చివేసారు.
12 ఈ పట్టణాలన్నింటినీ యెహోషువ పట్టుకొన్నాడు. వాటి రాజులందరినీ అతడు చంపివేసాడు. ఆ పట్టణాల్లో ఉన్న సమస్తాన్నీ పూర్తిగా యెహోషువ నాశనం చేసాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టే అతడు ఇలా చేసాడు.
13 కానీ వారి కొండలమీద కట్టబడిన పట్టణాలలోని ఒక్కటికూడ ఇశ్రాయేలు సైన్యం కాల్చివేయలేదు. వారు కాల్చివేసిన కొండ మీద పట్టణం హజోరు మాత్రమే. ఇది యెహోషువ కాల్చిన పట్టణం.
14 ఈ పట్టణాల్లో దొరికిన వాటన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలు వారికోసమే ఉంచుకొన్నారు. ఆ పట్టణంలోని జంతువులన్నింటినీ వారే ఉంచుకొన్నారు. కానీ అక్కడ ప్రజలను అందరినీ చంపివేసారు. మనుష్యులు ఎవరినీ వారు బ్రతకనివ్వలేదు.
15 ఇలా చేయుమని చాలకాలం క్రితమే యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఇలా చేయుమని మోషే యెహోషువకు ఆజ్ఞాపించియున్నాడు. కనుక యెహోషువ దేవునికి విధేయుడయ్యాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యెహోషువ జరిగించాడు.
16 కనుక ఈ దేశం అంతటిలో ఉన్న ప్రజలందరినీ యెహోషువ ఓడించాడు. కొండదేశం, నెగెవు ప్రాంతం, గోషెను ప్రాంతం అంతాను, పడమటి కొండల దిగువ ప్రాంతం, అరాబా ప్రాంతం, ఇశ్రాయేలు పర్వతాలు, వాటి దగ్గర్లో ఉన్న కొండలు అన్నింటిమీదా అతడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు.
17 శేయీరు దగ్గర హాలాకు కొండ నుండి హెర్మోను కొండ దిగువన లెబానోను లోయలో బయల్గాదు వరకు ఉన్న దేశం అంతా యెహోషువ స్వాధీనంలో ఉంది. ఆ దేశంలోని రాజులందరినీ యెహోషువ పట్టుకొని చంపివేసాడు.
18 యెహోషువ ఆ రాజులతో చాల సంవత్సారాలు యుద్ధం చేసాడు.
19 ఆ దేశం మొత్తంలో ఒక్క పట్టణం మాత్రమే ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొంది. గిబియోనులో నివసిస్తున్న హివ్వీ ప్రజలే వారు. మిగతా పట్టణాలన్నీ యుద్ధంలో ఓడించబడ్డాయి.
20 ఆ ప్రజలు తాము చాలా బలంగల వాళ్లమని అనుకోవాలనే యెహోవా కోరాడు. అప్పుడే వారు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తారు. ఈ విధంగా ఆయన వారిని నిర్దాక్షిణ్యంగా నాశనం చేయనిచ్చాడు. మోషే ఏమిచేయాలని యెహోవా ఆజ్ఞాపించాడో అలాగే ఆయన వారిని నాశనం చేయబడనిచ్చాడు.
21 హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా ప్రాంతాల్లోను, కొండదేశంలోను అనాకీ ప్రజల నివసించారు. ఈ అనాకీ ప్రజలతో యెహోషువ యుద్ధం చేసాడు. ఆ ప్రజలందరినీ, వారి పట్టణాలను యెహోషువ పూర్తిగా నాశనం చేసాడు.
22 ఇశ్రాయేలు దేశంలో అనాకీ ప్రజలు ఎవ్వరూ ప్రాణంతో మిగుల లేదు. మిగిలిన అనాకీ ప్రజలు గాజా, గాతు, అష్డోదులలో నివసించారు.
23 ఇశ్రాయేలు దేశం అంతటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా మోషేకు చెప్పింది ఇదే. యెహోవా వాగ్దానం చేసినందువల్ల ఆయన ఆ దేశాన్నీ ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. యెహోషువ ఆ దేశాన్ని ఇశ్రాయేలు వంశాలకు పంచిపెట్టాడు. అప్పుడు యుద్ధం ముగిసింది. చివరికి దేశంలో శాంతి నెలకొంది.

Joshua 11:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×