[*కొన్ని గ్రీకు ప్రతులలో 4వ వచనం చేర్చబడింది: “అప్పుడప్పుడు ప్రభువు దూత దిగి వచ్చి ఆ నీళ్ళను కదిలించేవాడు. అలా నీళ్ళు కదిలిన వెంటనే ఆ కోనేరులోకి దిగిన మొదటి వాని రోగాలన్నీ నయమయ్యేవి.” ]
ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు: అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు” అని అన్నాడు.
ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసుకొని, “చూడు! నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అయ్యావు. పాపాలు చెయ్యటం మానేయి. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు!” అని అన్నాడు.
ఈ కారణంగా యూదులాయన్ని చంపటానికి యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు, “అతడు విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా చేసి తనను దేవునితో సమానం చేసుకొంటున్నాడు” అని అన్నారు.
యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు.
తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు.
తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు.
యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట.
“నేను స్వయంగా ఏదీ చెయ్యలేను. నేను దేవుడు చెప్పమన్న తీర్పు చెబుతాను. అందువలన నా తీర్పు న్యాయమైనది. నెరవేర వలసింది నాయిచ్ఛ కాదు. నేను నన్ను పంపిన వాని యిచ్ఛ నెర వేర్చటానికి వచ్చాను.
“నా దగ్గర యోహాను సాక్ష్యాని కన్నా గొప్ప సాక్ష్యం ఉంది. పూర్తి చెయ్యమని తండ్రి నాకు అప్పగించిన కార్యాల్ని నేను పూర్తి చేస్తున్నాను. ఈ కార్యాలు తండ్రి నన్ను పంపాడని నిరూపిస్తాయి.