సీయోనులో బూర ఊదండి. నా పవిత్ర పర్వతం మీద హెచ్చరికగా కేకవేయండి. దేశంలో నివసించే ప్రజలందరూ భయంతో వణుకుదురు గాక. యెహోవా ప్రత్యేకదినం వస్తుంది. యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది.
అది ఒక చీకటిదుర్దినంగా ఉంటుంది. అది అంధకారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది. సూర్యోదయాన సైన్యం పర్వతాలలో నిండి ఉండటం నీవు చూస్తావు. అది మహశక్తిగల సైన్యంగా ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటిది ఏదీ, ఎన్నడూ ఉండలేదు. మరియు ఇలాంటిది ఏది, ఎన్నటికీ మరో సారి ఉండదు.
వారి మాట వినండి. అది పర్వతాలమీద రథాలు పరుగులెత్తిన ధ్వనిలా ఉంది. అది పొట్టును కాల్చి వేస్తోన్న అగ్నిజ్వాలల శబ్ధంలా ఉంది. వారు శక్తిగల ఒక జనం. వారు యుద్ధానికి సిద్దంగా ఉన్నారు.
వారు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడరు. ప్రతి సైనికుడూ తన సొంత దారిలో నడుస్తాడు. ఒక సైనికుడు దెబ్బ తగిలి పడిపోతే మిగిలిన వారు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు.
యెహోవా తన సైన్యాన్ని గట్టిగా పిలుస్తాడు. ఆయన విడిది చాలా విశాలమైంది. ఆ సైన్యం ఆయన ఆదేశాలకు లోబడుతుంది. ఆ సైన్యం చాలా శక్తిగలది. యెహోవా ప్రత్యేక దినం ఒక గొప్ప భయంకర దినం. ఏ మనిషీ దానిని ఆపు చేయలేవు.
మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చింపుకోండి.” మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి. ఆయన దయ, జాలిగలవాడు. ఆయన త్వరగా కోపపడడు. ఆయనకు ఎంతో ప్రేమఉంది. ఒక వేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విషయంలో ఆయన తన మనస్సు మార్చుకొంటాడేమో.
ఒకవేళ యెహోవా తన మనస్సు మార్చుకొంటాడేమో ఎవరికి తెలుసు. మరియు ఒకవేళ ఆయన తన వెనుక నీ కోసం ఒక ఆశీర్వాదం విడిచి పెడతాడేమో. అప్పుడు నీవు నీ యెహోవా దేవునికి ధాన్యార్పణం పానీయా ర్పణలు అర్పించవచ్చు.
ప్రజలను సమావేశం చేయండి. ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. పెద్దవాళ్లును సమావేశపరచండి. చిన్న పిల్లలను, తల్లుల స్తనములను ఇంకా కుడిచే చిన్న శిశువులను సహితం సమావేశపరచండి. పెండ్లి కుమార్తెను, ఆమె పెండ్లి కుమారున్ని వారి పడక గది నుండి బయటకు రప్పించండి.
యాజకులను, యెహోవా సేవకులను మండపానికి బలిపీఠానికి మధ్య విలపించ నివ్వండి ఆప్రజలందరూ ఈ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు. నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు. నీ ప్రజలను గూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు. ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ ‘వారిదేవుడు ఎక్కడ?’ ” అని చెప్పనియ్యకు.
యెహోవా తన ప్రజలతో మాట్లాడాడు. ఆయన చెప్పాడు, “నేను మీకు ధాన్యం, ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. అవి మీకు సమృద్ధిగా ఉంటాయి. రాజ్యాల మధ్య నేను మిమ్మిల్ని ఇంకెంత మాత్రం అవమానించను.
లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను. ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు వెెళ్ళేటట్టు నేను చేస్తాను. వారిలో కొందరు తూర్పు సముద్రానికి వెళ్తారు. మరి కొందరు పడమటి సముద్రానికి వెళ్తారు. ఆ ప్రజలు అంత భయంకరమైన పనులు చేశారు. కాని వారు చచ్చి కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు. అక్కడ భయంకరమైన కంపు కొడుతుంది!”
పొలంలోని పశువులారా, భయపడవద్దు. అరణ్యపు బీళ్ళు మరలా గడ్డి మొలిపిస్తాయి. చెట్లఫలాలు ఫలిస్తాయి. అంజూరపు చెట్లు, మరియు ద్రాక్షావల్లులు మరిన్ని ఫలాలు ఫలిస్తాయి.
కనుక, సీయోను ప్రజలారా, సంతోషించండి. మీ యెహోవా దేవునియందు ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఆయన తన మంచితనాన్ని చూపి వర్షం కురిపిస్తాడు. ఇదివరకటివలె ఆయన మీకు ముందటి వర్షాలు కడపటి వర్షాలుకురిపిస్తాడు.
“నేనే యెహోవాను, నా సైన్యాన్ని మీకు విరోధంగా పంపించాను. ఆ దండు మిడుతలు, ఆ దూకుడు మిడుతలు, ఆ వినాశ మిడుతలు మరియు ఆ కోత మిడుతలు మీ వాటిని తినివేశాయి. కాని నేనే యెహోవాను, ఆ కష్టకాల సంవత్సరాలన్నింటికీ తిరిగి మీకు నేను చెల్లిస్తాను.
అప్పుడు మీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మీరు తృప్తిగా ఉంటారు. మీ యెహోవా దేవుని నామం మీరు స్తుతిస్తారు. మీకోసం అయన అశ్చర్యకార్యాలు చేస్తాడు. నా ప్రజలు తిరిగి ఎన్నటికి సిగ్గుపరచబడరు.
ఇశ్రాయేలు ప్రజలకు నేను తోడుగా ఉన్నానని మీరు తెలుసుకొంటారు. మీ దేవుడనైన యెహోవాను నేనే అనిమీరు తెలుసుకొంటారు. మరో దేవుడు ఎవ్వరూ లేరు. నా ప్రజలు తిరిగి ఎన్నడూ సిగ్గుపడరు.”
“దీని తరువాత ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను). మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. మీ ముసలివాళ్ళు కలలు కంటారు. మీ యువకులు దర్శనాలు చూస్తా రు.
అప్పుడు యెహోవా నామాన్ని స్మరించే ఏ వ్యక్తి అయినా సరే రక్షింపడతాడు. సీయోను కొండమీద యెరూషలేములో రక్షింపబడిన మనుష్యులు ఉంటారు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరుగుతుంది. మిగిలిన వారిలో యెహోవా పిలిచిన వారు ఉంటారు.