ఆహాజు యోతాము కుమారుడు. యోతాము ఉజ్జియా కుమారుడు. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు, పెకహు ఇశ్రాయేలు రాజు. ఆహాజు యూదాకు రాజుగా ఉన్న కాలంలో, రెజీను, పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్లారు. కాని వారు ఆ పట్టణాన్ని ఓడించలేక పోయారు.
దావీదు కుటుంబానికి ఒక సందేశం ఇవ్వబడింది. “అరాము (సిరియా) సైన్యం, ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) సైన్యం ఒకటిగా కలిశాయి. రెండు సైన్యాలు కలిసి బసచేస్తున్నాయి” అనేది ఆ సందేశం. అహాజు రాజు ఈ సందేశం విన్నప్పుడు అతడు, ప్రజలు చాలా భయపడిపోయారు. అరణ్యంలో గాలికి కొట్టుకొనే చెట్లలా వారు భయంతో వణకి పోయారు.
అప్పుడు యెషయాతో యెహోవా చెప్పాడు, “నీవూ, నీ కుమారుడూ షెయార్యాషూబు వెళ్లి ఆహాజుతో మాట్లాడండి. పైకోనేటిలోకి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లండి. ఇది చాకలివాని పొలానికి పోయే దారిలో ఉంది.
“ఆహాజుతో చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, గాని నెమ్మదిగా ఉండండి. భయపడవద్దు. వాళ్లిద్దరు మనుష్యులు, అంటే రెజీను, రెమల్యా కుమారుడు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. వాళ్లు కాలిపోయిన రెండు కట్టెల్లాంటి వాళ్లు. గతంలో వాళ్లు వేడిగా మండుతూండేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లు వట్టి పొగ మాత్రమే. రెజీను, సిరియా, రెమల్యా కుమారుడు కోపంగా ఉన్నారు.
రెజీను దమస్కుకు పాలకునిగా ఉన్నంతవరకు అది జరుగదు. ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) ఇప్పుడు ఒక రాజ్యం. కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) రాజ్యంగా ఉండదు.
ఎఫ్రాయిముకు షోమ్రోను రాజధానిగా ఉన్నంత వరకు, రెమల్యా కుమారుడు దాని పాలకునిగా ఉన్నంతవరకు వారి పథకం నెరవేరదు. ఈ సందేశాన్ని నీవు నమ్మకపోతే ప్రజలు నిన్ను నమ్మగూడదు.”
యెహోవా చెప్పాడు: “ఈ సంగతులు సత్యం అని నీ మట్టుకు నీవు రుజువు చేసుకొనేందుకు ఒక సూచన కోసం అడుగు. నీకు కావాల్సిన ఏ సూచన కోసమైనా నీవు అడగవచ్చు. ఆ సూచన పాతాళమంత లోతునుండి రావచ్చు, లేక ఆ సూచన ఆకాశమంత ఎత్తునుండి అయినా రావచ్చును.”
అప్పుడు యెషయా చెప్పాడు, “దావీదు వంశమా, జాగ్రత్తగా ఆలకించు. మీరు ప్రజల సహనాన్ని పరీక్షిస్తారు. కానీ అది మీకు ముఖ్యంకాదు. కనుక మీరు ఇప్పుడు నా దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు.
“కానీ మీరు యెహోవాను గూర్చి భయపడాలి. ఎందుకంటే యెహోవా మీకు కొన్ని కష్టకాలాలను తీసుకొని వస్తాడు. మీ ప్రజలకు, మీ తండ్రివంశ ప్రజలకు ఆ కష్టాలు వస్తాయి. దేవుడేమి చేస్తాడు? మీ మీద యుద్ధం చేయటానికి అష్షూరు రాజును యెహోవా తీసుకొని వస్తాడు.
“ఆ సమయంలో యెహోవా ‘జోరీగల్ని’ రప్పిస్తాడు. (ఆ ‘జోరీగలు’ ఇప్పుడు ఈజిప్టు నదుల దగ్గర ఉన్నాయి) మరియు యెహోవా కందిరీగల్ని రప్పిస్తాడు. (కందిరీగలు ఇప్పుడు అష్షూరు దేశంలో ఉన్నాయి.) ఈ శత్రువులు మీ దేశానికి వస్తారు.
ఈ దేశంలో వెయ్యేసి ద్రాక్షా వల్లులు ఉన్న పొలాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక్కో ద్రాక్ష వల్లి వెయ్యి వెండి నాణాల విలువ చేస్తుంది. కానీ ఈ పొలాలు గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లతో నిండిపోతాయి.
ఒకప్పుడు ఈ కొండల మీద ప్రజలు పనిచేసి, ఆహారం పండించారు. కానీ ఆ సమయంలో మనుష్యులు అక్కడికి వెళ్లరు. దేశమంతా గచ్చ పొదలతో, బలు రక్కసి చెట్లతో నిండిపోతుంది. గొర్రెలు, పశువులు మాత్రమే ఆ స్థలాలకు వెళ్తాయి.”