“ఆకాశంలో నా ఖడ్గం రక్తసిక్తమైనప్పుడు ఇది జరుగుతుంది” అని యెహోవా చెబతున్నాడు. చూడండి! యెహోవా ఖడ్గం ఎదోముగుండా దూసుకొనిపోతుంది. ఆ ప్రజలు దోషులని యెహోవా తీర్పు చెప్పాడు, గనుక వారు చావాల్సిందే.
శిక్షా సమయం ఒకటి యెహోవా ఏర్పాటు చేశాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి. ప్రజలు సీయోనుకు చేసిన కీడులకు వారు బదులు చెల్లించటానికి యెహోవా ఒక సంవత్సరాన్ని ఎంచుకొన్నాడు.
అగ్ని రాత్రింబవళ్లు మండుతూ ఉంటుంది. అగ్నిని ఎవ్వరూ ఆర్పివేయలేరు. ఎదోమునుండి పొగ శాశ్వతంగా లేస్తుంది. ఆ దేశం శాశ్వతంగా ఎప్పటికీ నాశనం చేయబడుతుంది. ఆ దేశంగుండా మళ్లీ ఎవ్వరూ ఎన్నడూ ప్రయాణం చేయరు.
అక్కడి అందమైన గృహాలన్నింటిలో ముళ్ల కంపలు, పిచ్చిపొదలు పెరుగుతాయి. అడవి కుక్కలు, గుడ్లగూబలు ఆ ఇండ్లలో నివసిస్తాయి. అడవి జంతువులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొంటాయి. అక్కడ పెరిగే గడ్డి దుబ్బుల్లో పెద్ద పక్షులు నివసిస్తాయి.
పాములు అక్కడ పుట్టలు పెడ్తాయి. పాములు అక్కడ గుడ్లు పెడ్తాయి. గుడ్లు పగులుతాయి పాము పిల్లలు ఆ చీకటి స్థలాల్లో పాకుతాయి. చచ్చిన శవాలను తినే పక్షులు, ఆడవాళ్లు వారి స్నేహితురాళ్లను కలుసుకొన్నట్టుగా అక్కడ కలుసుకొంటాయి.
యెహోవా గ్రంథాన్ని చూడండి. అక్కడ ఏమి వ్రాసి ఉందో చదవండి. ఏమీ తప్పిపోలేదు. ఆ జంతువులు కలిసి ఉంటాయని ఆ గ్రంథములో వ్రాయబడిఉంది. వాటిని ఒక్క చోట చేరుస్తానని దేవుడు చెప్పాడు. కనుక దేవుని ఆత్మ వాటిని ఒక్క చోట చేర్చటం జరుగుతుంది.
వాటి విషయంలో చేయాల్సిన దాన్ని దేవుడు నిర్ణయం చేశాడు. అప్పుడు దేవుడు వాటికి ఒక చోటు నిర్ణయించాడు. దేవుడు ఒక గితగీసి, వాటి స్థలం వాటికి చూపించాడు. అందుచేత ఆ దేశం ఆ జంతువులకు శాశ్వతంగా స్వంతం. సంవత్సరం వెంబడి సంవత్సరం అవి అక్కడే నివసిస్తాయి.