ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి! ఈ దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యెం ఏమిటో యెహోవా చెపుతాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మకస్తులుగాను లేరు.
ప్రజలు (అబద్ధపు) ఒట్టు పెట్టుకుంటారు, అబద్ధాలు చెపుతారు, చంపుతారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరల మరల హత్య చేస్తారు.
అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి.
“నా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయబడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను.
వారు భోజనం చేస్తారు కాని వారికి తృప్తి ఉండదు. వారు లైంగిక పాపాలు చేస్తారు. కాని వారికి పిల్లలు ఉండరు. ఎందుచేతనంటే వారు యెహోవాను విడిచిపెట్టి వేశ్యలవలె తయ్యారయ్యారు.
సలహా కోసం నా ప్రజలు కట్టెముక్కలను అడుగుతున్నారు. ఆ కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ ఆ బూటకపు దేవతలను వెంటాడారు.
వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండలమీద, సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేస్తారు. ఆ చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు ఆ చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లు కూడాపాపాలు చేస్తారు.
“వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను నిందించలేను. పురుషులు వెళ్లి వేశ్యలతో పడుకొంటారు. వారు వెళ్లి ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక ఆ తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు.
“ఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. కానీ యూదాను అపరాధిగా ఉండ నియ్యకుము. గిల్గాలుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్లకుము. ప్రమాణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించకుము. మరియు ‘యెహోవా జీవంతోడు …!’ అని అనవద్దు.
ఇశ్రాయేలుకు యెహోవా ఎన్నో ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమైన పొలంలోకి తన గొర్రెలను తీసికొనివెళ్లే కాపరిగా ఆయన ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు మొండిది. ఇశ్రాయేలు మరల మరల పారిపోయే పెయ్యలాగ ఉంది.