“నరపుత్రుడా, తూరు పాలకునికి ఇలా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా నీకు చెప్పునదేమనగా: “ ‘నీవు గర్విష్ఠివి! “నేనే దేవుడను! సముద్ర మధ్యంలో దైవ స్థానంలో కూర్చున్నాను” అని నీవంటున్నావు. “ ‘కాని నీవు మానవ మాత్రుడవు. దేవుడవు, మాత్రం కాదు. నీవు దేవుడవని నీకై నీవే అనుకుంటున్నావు.
అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను. వారు దేశాలన్నిటిలో అతి భయంకరులు! వారు తమ కత్తులను దూస్తారు. నీ తెలివితేటలు సముపార్జించి పెట్టిన అందమైన వస్తువుల మీద వాటిని ఉపయోగిస్తారు. వారు నీ కీర్తిని నాశనం చేస్తారు.
నిన్నొక వ్యక్తి చంపివేస్తాడు. అప్పుడు “నేను దేవుణ్ణి” అని నీవు చెప్పుకోగలవా? ఆ సమయంలో అతడు నిన్ను తన అధీనంలో ఉంచుతాడు. దానితో నీవొక మానవ మాత్రుడవనీ, దేవుడవు కావనీ నీవు తెలుసుకుంటావు!
“నరపుత్రుడా, తూరు రాజను గురించి ఈ విషాద గీతం ఆలపించు. అతనికి ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ ‘నీవు ఆదర్శ పురుషుడవు. నీకు జ్ఞానసంపద మెండు. నీ అందం పరిపూర్ణమైనది.
దేవుని ఉద్యానవనమైన ఏదెనులో నీవున్నావు. నీవద్ద ప్రతి విలువైన రత్నం ఉంది. కెంపులు, గోమేధికము, ఇతర రత్నాలు; గరుడ వచ్చలు, సులిమానురాయి, పచ్చరాయి; నీల మణులు, వైడూర్యము, మరకత పచ్చలు. వీటిలో ప్రతిరాయీ బంగారంలో పొదగబడింది. నీవు సృష్టింపబడిన రోజుననే దేవుడు నిన్ను బలవంతుడిగా చేశాడు.
నీవు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన కెరూబులలొ [†కెరూబులు సాక్ష్యపు మందసం మీదనున్న కాపలా వాళ్లు, రాజ సింహాసనవు దార్లలాగ ఉన్నారు.] ఒకడవై యున్నావు. నీ రెక్కలు నా సింహాసనం మీదికి చాపబడ్డాయి. దేవుని పవిత్ర పర్వతం మీద నిన్ను ఉంచాను. అగ్నిలా మెరిసే ఆభరణాల గుండా నీవు నడిచావు.
నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది. ధనంతో పాటు నీలో మదం (గర్వం) పెరిగింది. దానితో నీవు పాపం చేశావు. అందువల్ల నిన్నొక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగణించాను. దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను తోసివేశాను. నీవు ప్రత్యేక కెరూబులలో ఒకడవు. నీ రెక్కలు నా సింహాసనం పైకి చాప బడ్డాయి. కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను వదిలిపెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను.
నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు. నీ గొప్పతనం యెక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు చేసింది. అందువల్ల నిన్ను కిందికి పడదోశాను. ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార జూస్తున్నారు.
నీవు చాలా పాపాలు చేశావు. నీవు చాలా కుటిలమైన వర్తకుడవు. ఈ రకంగా పవిత్ర స్థలాలను నీవు అపవిత్ర పర్చావు. కావున నీలో నేను అగ్ని పుట్టించాను. అది నిన్ను దహించి వేసింది! నీవు నేలమీద బూడిదవయ్యావు. ఇప్పుడు ప్రతి ఒక్కడు నీ అవమానాన్ని చూడ గలడు.
ఈ రకంగా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ ‘సీదోనూ, నేను నీకు వ్యతిరేకిని! నీ ప్రజలు నన్ను గౌరవించటం నేర్పుకుంటారు! నేను సీదోనును శిక్షిస్తాను. ప్రజలు నేనే యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు. నేను పవిత్రుడనని వారు నేర్చుకుని నన్ను ఆ విధంగా చూసుకుంటారు.
“ ‘గతంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు దానిని అసహ్యించుకున్నాయి. కాని ఆయా దేశాలకు కీడు జరుగుతుంది. ఇశ్రాయేలు వంశాన్ని బాధించే ముండ్లు గాని, వదలక అంటుకునే ముండ్ల పొదలు గాని ఇక ఎంత మాత్రం ఉండవు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదరగొట్టాను. కాని, ఇశ్రాయేలు వంశాన్ని నేను మళ్లీ ఒక్క చోటికి చేర్చుతాను. అప్పుడా రాజ్యాలన్నీ నేను పవిత్రుడనని తెలుసుకుంటాయి. అవి నన్ను ఆ విధంగా గౌరవిస్తాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ రాజ్యంలో నివసిస్తారు. ఆ రాజ్యాన్ని నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చాను.
వారు ఆ రాజ్యంలో క్షేమంగా ఉంటారు. వారు ఇండ్లు కట్టుకొని, ద్రాక్షాతోటలు పెంచుకుంటారు. నేను వారి చుట్టూ ఉండి, వారిని అసహ్యించుకున్న దేశాల వారిని శిక్షిస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా జీవిస్తారు. అప్పుడు నేనే వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకొంటారు.”