తూరును గురించిన ఈ విషయాలు తెలియజేయుము: “ ‘తూరూ, నీవు సముద్రాలకు ద్వారం వంటిదానవు. అనేక దేశాలకు నీవు వ్యాపారివి. తీరం వెంబడి నీవనేక దేశాలకు ప్రయాణం చేస్తావు. నిన్ను గూర్చి నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: తూరూ, నీవు చాలా అందమైన దానివని నీవనుకుంటున్నావు. నీవు చక్కని సుందరాంగివని తలపోస్తున్నావు!
నీ నిర్మాణపు పనివారు శెనీరు (హెర్మోను కొండ) నుండి తెచ్చిన తమాల వృక్షపు కర్రతో (ఓడ) బల్లలు తయారుచేశారు. లెబానోను సరళవృక్షపు కర్రతో నీ ఓడ స్తంభాలను చేశారు.
బాషాను నుండి తెచ్చిన సింధూర వృక్షపు కర్రతో పడవ తెడ్లు చేశారు. కిత్తీయుల ద్వీపం (సైప్రస్) నుండి తెచ్చిన దేవదారు వృక్షపు కర్రను వినియోగించి అడుగు అంతస్థులో గదిని నిర్మించారు. ఈ గదిని దంతపు పనితో అలంకరించారు.
ఈజిప్టు నుండి తెచ్చిన రంగు రంగుల నారబట్టలు నీ తెరచాపలుగా ఉపయోగించారు. ఆ తెరచాపయే నీ పతాకం. నీ గది తెరలు నీలం, ఊదా రంగులను కలిగి ఉన్నాయి. అవి ఎలిషా (సైప్రస్) [*సైప్రస్ ఎలీషా ద్వీపం ఎంకోమావద్ద గల ప్రాంతం గాని, సైప్రస్ గాని, లేక ఒక గ్రీకు ద్వీపం గాని కావచ్చు.] ద్వీపంనుండి వచ్చినవి.
బిబ్లోసు (గెబలు) పెద్దలు, నేర్పరులైన పనివారు ఓడమీద ఉండి చెక్కల మధ్య కీలువేసి ఓడను బాగుచేశారు. సముద్రం మీదనున్న అన్ని ఓడలు, వాటి నావికులు నీతో వర్తక వ్యాపారాలు చేయటానికి నీ వద్దకు వచ్చారు.’
“పారసీకులు (పర్షియావారు), లూదు వారు, పూతువారు నీ సైన్యంలో ఉన్నారు. వారు నీ యుద్ధ వీరులు. వారు తమ డాళ్లను, శిరస్త్రాణాలను నీ గోడలకు వేలాడదీశారు. వారు నీ నగరానికి ప్రతిష్ఠను తెచ్చి పెట్టారు.
నీ నగరం చుట్టూ అర్వదు మనుష్యులు కాపలాదారులుగా నిలబడియున్నారు. బురుజులలో గామదు మనుష్యులు ఉన్నారు. నీ నగరం చుట్టూ వాళ్లు తమ డాళ్లను వ్రేలాడదీసియున్నారు. వాళ్లు నీ సౌందర్యాన్ని సంపూర్ణముగా చేశారు.
“తర్షీషు [†తర్షీషు ఇది స్పెయిన్లో ఒక నగరం కావచ్చు.] నీకున్న మంచి ఖాతాదారులలో ఒకటి. నీవు అమ్మే అద్భుతమైన వస్తువులకు వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చేవారు.
నీవద్ద అనేక మంచి వస్తువులు ఉన్న కారణంగా ఆరాము నీతో వ్యాపారం చేసింది. నీవు అమ్మే సరుకులకు ఎదోము ప్రజలు పచ్చమణులు, ఊదారంగు బట్టలు, సున్నితమైన అల్లిక పనిచేసిన వస్త్రాలు, నాజూకైన నారబట్టలు, పగడాలు, కెంపులు ఇచ్చేవారు.
దమస్కు నీకు మరో మంచి ఖాతా దారు. నీవద్ద ఉన్న అనేక అద్భుత వస్తువులను వారు కొనుగోలు చేశారు. ప్రతిగా వారు హెల్బోను నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని, తెల్ల ఉన్నిని నీకిచ్చేవారు.
నీవమ్మే సరుకులకు దమస్కువారు ఉజాల్ నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని నీకిచ్చేవారు. వాటిని ఇనుము, కసింద మూలిక, చెరకును వారు కొన్న వస్తువులకు మారుగా ఇచ్చేవారు.
షేబ దేశపు వర్తకులు, రామా ప్రాంత వర్తకులు నీతో వ్యాపారం చేశారు. నీ వస్తువులకు వారు మిక్కిలి శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలు, నానారకాల విలువైన రాళ్లు, బంగారం ఇచ్చేవారు.
నీవద్ద కొన్న సరుకులకు వారు నాణ్యమైన వస్త్రాలు, నీలవర్ణపు, అల్లిక పనిచేసిన దుస్తులు, రంగు రంగుల తివాచీలు, బాగా పురిపెట్టి వేనిన తాళ్ళు, దేవదారు కలపతో చేయబడిన అనేక వస్తువులు ఇచ్చేవారు. ఈ వస్తు సామగ్రులతో వారు నీతో వ్యాపారం చేశారు.
నీ ధనమంతా సముద్రం పాలవుతుంది. నీ ఐశ్వర్యం, నీ వర్తకం, నీ సరుకు, నీ నావికులు, చుక్కాని పట్టేవారు, కీలుపెట్టి పడవలు బాగుచేసే పనివారు, నీ అమ్మకపు దారులు, నీ నగరంలో గల సైనికులు, నీ ఓడ సిబ్బంది అంతా సముద్రంలో మునిగిపోతారు! నీవు నాశనమయ్యే రోజున ఇదంతా జరుగుతుంది.
నీ కొరకు వారు తమ తలలు గొరిగించు కుంటారు. వారు విషాద సూచక దుస్తులు ధరిస్తారు. వారు నీకొరకు దుఃఖిస్తారు. మృతుడైన వ్యక్తి కొరకు ఏడ్చేవానిలా వారు శోకిస్తారు.
నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు. నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకులంతోను నీవనేక మందిని తృప్తిపర్చావు. ఈ భూమిపై గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా చేశావు!
ఇతర రాజ్యాల వర్తకులు నిన్ను చూసి చులకనగా మాట్లాడారు. నీకు జరిగిన సంఘటనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. ఎందువల్ల నంటే నీవు సర్వనాశనమయ్యావు. నీవికలేవు.’ ”