అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల ‘దేవుడైన యెహోవా అంటున్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.’
పొలాల్లోని నీ జంతువులు అన్నింటి మీద యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. నీ గుర్రాలు, నీ గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు అన్నింటికీ భయంకర రోగం వచ్చేటట్టు యెహోవా చేస్తాడు.
ఇశ్రాయేలీయుల జంతువులు ఏవైనా చచ్చాయేమో చూడమని ఫరో మనుష్యుల్ని పంపాడు. ఇశ్రాయేలీయుల జంతువుల్లో ఒక్కటి కూడ చావలేదు. ఫరో మాత్రం మొండిగానే ఉండిపోయాడు. అతడు ప్రజల్ని వెళ్లనివ్వలేదు.
మోషే, అహరోనులు కొలిమి నుండి బూడిద తీసుకొన్నారు. తర్వాత వెళ్లి ఫరో ఎదుట నిలబడ్డారు. ఆ బూడిదను వారు గాలిలో వెదజల్లారు, మనుష్యుల మీద, జంతువుల మీద దద్దుర్లు పుట్టడం మొదలయింది.
అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఉదయాన్నే లేచి, ఫరో దగ్గరికి వెళ్లు. ‘నన్ను ఆరాధించడానికి, నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల దేవుడైన, యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు.
నీవు గనుక ఇలా చెయ్యకపోతే, అప్పుడు నీ మీద, నీ ప్రజలమీద, నీ అధికారుల మీద నా శక్తి అంతా ప్రయోగిస్తాను. అప్పుడు నాలాంటి దేవుడు ప్రపంచంలోనే లేడని నీకు తెలుస్తుంది.
కనుక రేపు ఈ వేళకు మహా బాధాకరమైన వడగళ్ల వానను నేను కురిపిస్తాను. ఇంతకు ముందు ఎన్నడూ ఈజిప్టు ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ ఇలాంటి వడగళ్ల వాన పడలేదు.
ఇక నీవు నీ జంతువుల్ని క్షేమంగా ఉండేచోట పెట్టుకోవాలి. ప్రస్తుతం పొలాల్లో ఉన్న నీ స్వంతదైన ప్రతిదాన్నీ భద్రమైన చోట నీవు ఉంచుకోవాలి. ఎందుచేతనంటే పొలాల్లో నిలబడి ఉండే మనిషిగాని జంతువుగాని చచ్చినట్లే. ఇంట్లో చేర్చబడకుండా ఉండే ప్రతి దానిపై నా వడగళ్లు కురుస్తాయి.’ ”
నీ చేతులు గాలిలో పైకి ఎత్తు, “ఈజిప్టు అంతటా వడగళ్ల వాన ప్రారంభం అవుతుంది. ఈజిప్టు పొలాల్లో ఉన్న మొక్కలన్నిటి మీద, జంతువుల మీద, మనుష్యులందరి మీద వడగళ్లు పడతాయి” అని మోషేతో యెహోవా చెప్పాడు.
ఈజిప్టు పొలాల్లో ఉన్న సర్వాన్నీ ఈ వడగళ్ల వాన నాశనం చేసింది. మనుష్యుల్ని, జంతువుల్ని, మొక్కల్ని వడగళ్లు నాశనం చేసాయి. వడగళ్ల మూలంగా పొలాల్లోని చెట్లన్నీ విరిగి పోయాయి.
మోషే ఫరోతో చెప్పాడు: “నేను ఈ పట్టణంనుండి యెహోవా ఎదుట నా చేతులు చాచి ప్రార్థిస్తాను. ఉరుములు, వడగళ్లు ఆగిపోతాయి. ఈ భూమిమీద యెహోవా ఉన్నాడని మీరు అప్పుడు తెలుసుకొంటారు.