అందుకు యెహోవా, “ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. అతని మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. దానితో అతడు నా ప్రజలను వెళ్లనిస్తాడు. వారు వెళ్లిపోవడానికి అతడు ఎంత ఇష్టపడతాడంటే, అతడే వారిని వెళ్లిపొమ్మని బలవంతం చేస్తాడు” అని మోషేతో చెప్పాడు.
“యెహోవాను నేనే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు నేను ప్రత్యక్షమయ్యాను. వాళ్లు, (ఎల్షద్దయి) సర్వశక్తిగల దేవుడు అని నన్ను పిలిచారు. నా పేరు యెహోవా అని వారికి తెలియలేదు.
కనుక నేను వాళ్లతో నీవు ఇలా చెప్పమన్నట్టు ప్రజలతో చెప్పు. ‘నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని స్వతంత్రుల్నిగా చేస్తాను. ఈజిప్టు వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు. నేను నా మహాశక్తిని ప్రయోగించి మహా భయంకర శిక్షను ఈజిప్టు వారి మీదికి రప్పిస్తాను. అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను.
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను.’ ”
కాని మోషే, అహరోనులతో యెహోవా మాట్లాడాడు. వారు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. ఫరో దగ్గరికి వెళ్లి అతనితో కూడ మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటకు నడిపించుమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు.