పవిత్ర స్థలంలో యాజకులు పరిచర్య చేసేటప్పుడు ధరించే ప్రత్యేక వస్త్రాలు తయారు చేసేందుకు నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టను పనివారు ఉపయోగించారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు అహరోనుకు గూడ ప్రత్యేక వస్త్రాలు తయారు చేసారు.
బంగారాన్ని సన్నని రేకులుగా వారు కొట్టారు. తర్వాత బంగారాన్ని పొడవైన తీగలుగా కోసారు. నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్ట, నాణ్యమైన బట్టతో బంగారాన్ని కలిపి కొట్టారు. ఇది చాల నైపుణ్యంగల వాని పని.
దట్టి కూడ ఆలాగే చేయబడింది అది ఏఫోదులో ఒక భాగంగా ఉండేటట్టు కలుపబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే బంగారు తీగ, నాణ్యమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం బట్టలతో అది చేయబడింది.
తర్వాత ఏఫోదు భుజ భాగాల మీద రత్నాలను వారు అమర్చారు. ఇశ్రాయేలు కుమారులలో ఒక్కొక్కరికి ఒక్కో రత్నం సూచనగా ఉంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇది చేయబడంది.
తర్వాత నీలి (దారంతో అల్లిన బట్ట) దట్టీతో తీర్పు పతకపు ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు కట్టారు. ఈ విధంగా తీర్పు పతకం నడికట్టును హత్తుకొని ఉంది. అది పడిపోదు. యెహోవా ఆజ్ఞాపించినట్లే వాళ్లు ఇవన్నీ చేసారు.
అంగీ అడుగు భాగం చుట్టూరా గంటలు, దానిమ్మలు ఉన్నాయి. ప్రతి దానిమ్మకూ మధ్య ఒక గంట వుంది సరిగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే యాజకుడు యెహోవాకు సేవ చేసేటప్పుడు ఈ అంగీని ధరించేవాడు.
ఇంకా పనివాళ్లు నాణ్యమైన బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేసారు.
నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో నడికట్టును వారు తయారు చేసారు. బట్టతో చిత్రపటాలు కుట్టబడ్డాయి. యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇవన్నీ చేయబడ్డాయి.
తర్వాత పవిత్ర కిరీటం కోసం ఒక బంగారు బద్ద తయారు చేసారు. దాన్ని స్వచ్ఛమైన బంగారంతో వాళ్లు చేసారు. బంగారం మీద వాళ్లు “యెహోవాకు పవిత్రం.” అనే మాటలు వ్రాసారు.
తర్వాత పవిత్ర సమావేశ గుడారాన్ని వారు మోషేకు చూపించారు. గుడారాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని వాళ్లు అతనికి చూపించారు. ఉంగరాలు, చట్రాలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మలు, అన్నీ వాళ్లు అతనికి చూపించారు.
ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలతో తయారు చేయబడిన గుడారపు పైకప్పును వారు అతనికి చూపించారు. పొట్టేళ్ల తోలుతో చేయబడ్డ పైకప్పును వారు అతనికి చూపించారు. మరియు శ్రేష్ఠమైన తోలుతో చేయబడ్డ పవిత్ర స్థల ప్రవేశానికి వేసే తెరను కూడా అతనికి చూపించారు.
ఇత్తడి బలిపీఠమును, ఇత్తడి తెరను వారు అతనికి చూపించారు. బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించే కర్రలను వారు మోషేకు చూపించారు. బలిపీఠం మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ వారు మోషేకు చూపించారు. గంగాళాన్ని గంగాళం కింద ఉండే దిమ్మను వారు అతనికి చూపించారు.
ఆవరణలో స్తంభాలు, దిమ్మలతో ఉన్న తెరల గోడను మోషేకు వారు చూపించారు. ఆవరణ ద్వారాన్ని కప్పి ఉంచే తెరను వారు అతనికి చూపించారు. తాళ్లను, పవిత్ర గుడారపు మేకలను వారు. అతనికి చూపించారు. పవిత్ర గుడారంలో, సన్నిధి గుడారంలో ఉన్నవాటన్నింటినీ వారు అతనికి చూపించారు.
తర్వాత పవిత్ర గుడారంలో సేవలు చేసే యాజకుల కోసం తయారు చేయబడ్డ వస్త్రాలను వారు మోషేకు చూపించారు. యాజకుడైన అహరోను, అతని కుమారుల కోసం తయారు చేయబడ్డ ప్రత్యేక వస్త్రాలను వారు అతనికి చూపించారు. వారు యాజకులుగా సేవ చేసినప్పుడు ఆ వస్త్రాలు ధరించారు.