అయితే మోషేతో యెహోవా యిలా అన్నాడు: “ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన నీ ప్రజలూ, నీవూ ఇక్కడనుండి వెళ్లిపోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్లండి. నేను వాళ్లకు వాగ్దానం చేసాను. మీ సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తానని నేను చెప్పాను.
మీకు ముందు వెళ్లడానికి ఒక దూతను నేను పంపిస్తాను. కనానీయులను, అమ్మోరీయులను, హిత్తీయులను పెరిజ్జీయులను. హివ్వీయులను, యెబూసీయులను నేను ఓడిస్తాను. ఆ ప్రజలు మీ దేశాన్ని విడిచి పెట్టేసేటట్టు బలవంతం చేస్తాను.
కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్లండి. కానీ నేను మీతో రాను. మీరు చాలా మొండివారు. నేను మీతో వస్తే మార్గంలో కోపంవచ్చి మిమ్మల్ని నేను నాశనం చేయవల్సి వస్తుందేమో.”
“మీరు మొండివారు నేను మీతో కొంచెంసేపు ప్రయాణం చేసినా సరే నేను మిమ్మల్ని నాశనం చేయాల్సి వస్తుంది. కనుక మీ నగలన్నీ తీసి వేయండి. అప్పుడు మీ విషయం ఏమి చేయాలో నేను ఆలోచిస్తాను” అని మోషేతో యెహోవా చెప్పినందువల్ల వారు నగలు ధరించలేదు.
గుడారాన్ని, నివాస డేరాలకు కొంత దూరం బయటకు జరిపాడు మోషే. “సన్నిధి గుడారం” అని మోషే దానికి పేరు పెట్టాడు. ఏ వ్యక్తిగాని యెహోవాను ఏదైనా అడగాలంటే, నివాస డేరాలకు వెలుపల ఉన్న సన్నిధి గుడారానికి వెళ్లాల్సి వచ్చింది.
ఎప్పుడేనా సరే, బయటకు ఆ గుడారానికి మోషే వెళ్తే ప్రజలంతా అతన్ని గమనిస్తూ ఉండేవారు. ప్రజలంతా వారి గుడారపు ద్వారం దగ్గర నిలబడి మోషే సన్నిధి గుడారంలో ప్రవేశించేవరకు అతణ్ణి గమనించి చుస్తుండేవారు.
మోషేతో ముఖాముఖీగా యెహోవా మాట్లాడాడు. ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో యెహోవా మాట్లాడాడు. దేవునితో మాట్లాడిన తర్వాత, మోషే ఎప్పుడూ బసకు వెళ్లిపోయేవాడు. నూను కుమారుడైన యెహోషువ అనే ఒక యువకుడు మోషేకు సహాయకుడు. మోషే సన్నిధి గుడారం వదిలినప్పుడల్లా యెహోషువ సన్నిధి గుడారంలో నిలిచి ఉండేవాడు.
యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “ఈ ప్రజల్ని నడిపించమని నీవు చెప్పావు. నాతో ఎవర్ని నీవు పంపిస్తావో నీవు చెప్పలేదు. ‘నీవు నాకు బాగా తెలుసు. నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను.’ అని నీవు నాతో చెప్పావు.
నిజంగా నేను నీక ఆనందం కలిగించి ఉంటే, నీ మార్గాలు నాకు బోధించు. నేను నిన్ను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగైతే, నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెడ్తూ ఉండగలుగుతాను. వీళ్లంతా నీ ప్రజలని జ్ఞాపకం ఉంచుకో.”
మరియు నా విషయంలో, ఈ ప్రజల విషయంలో నీవు సంతోషిస్తున్నట్టు మాకెలా తెలుస్తుంది? నీవు మాతో కూడా వస్తే, అప్పుడు మాకు తెలుస్తుంది. నీవు మాతో రాకపోతే, ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజలకంటే నేను, ఈ ప్రజలు ప్రత్యేకం కాదు.”
అప్పుడు యెహోవా జవాబిచ్చాడు: “నా మంచితనం అంతా నీ ముందు నడిచేటట్లు చేస్తాను. నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, దయ నేను చూపెడతాను.