“అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానంచేసిన దేశం యిదే. ‘మీ సంతతివారికి ఈ దేశం నేను యిస్తాను’ అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడ నిచ్చాను, నీవు అక్కడికి వెళ్లలేవు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
అప్పుడు నూను కుమారుడైన యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానాత్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేసారు.
ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి మోషే చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు, ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహాత్కార్యాలు ఈజిప్టులో ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలందరికి చూపించబడ్డాయి.