“ఆసమయంలో యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘మొదటి పలకల్లాంటివే రెండు పలకలు రాతితో నీవు చెక్కాలి. అప్పుడు నీవు కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే నీ కోసం ఒక చెక్క పెట్టెకూడా చేయాలి.
“కనుక నేను తుమ్మ కర్రతో ఒక పెట్టె చేసాను. మొదటి రెండు పలకల్లాంటివే మరి రెండు పలకలు రాతినుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ మీదికి వెళ్లాను. ఆ రెండు రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి.
అప్పుడు యెహోవా యింతకు ముందు ఆ పలకల మీద వ్రాసిన ఆ మాటలనే, అంటే ఆ కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పిన ఆ పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను నాకు ఇచ్చాడు.
నేను వెనక్కు తిరిగి, కొండ దిగి వచ్చేసాను. ఆ పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టుమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ పెట్టెలోనే ఉన్నాయి.”
(ఇశ్రాయేలు ప్రజలు యహకాను ప్రజల బావుల దగ్గరనుండి ప్రయాణం చేసి మోసెరుకు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయి, పాతిపెట్టబడ్డాడు. అహరోను కుమారుడు ఎలీయాజరు అహరోను స్థానంలో యాజకుడయ్యాడు.
ఆ సమయంలోనే యెహోవా తన ప్రత్యేక పని నిమిత్తం, లేవీ వంశాన్ని యితర వంశాలనుండి వేరు చేసాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను [*యెహోవా ఒడంబడిక పెట్టె పది ఆజ్ఞలు వ్రాయబడ్డ రెండు రాతిపలకలు మొదలైనవి ఉంచబడిన పెట్టె. అనగా మందసము.] మోయాల్సిన పని వారిది. యెహోవా ఆంలయలో యాజకులుగా కూడా వారు సహాయం చేసారు. మరియు యెహోవా నామమున ప్రజలను ఆశీర్వాదించాల్సిన పనికూడా వారికి ఉంది. ఈ ప్రత్యేక పని వారు నేటికీ చేస్తున్నారు.
“మొదటిసారిలాగే, 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను ఆ కొండమీద ఉండిపోయాను. ఆ సమయంలో యెహోవా నా మాట కూడా విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు.
యెహోవా ‘వెళ్లి ప్రజలను వారి ప్రయాణంలో నడిపించు. వారు వెళ్లి, వారికి ఇస్తానని వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన దేశంలో నివసిస్తారు’ అని నాతో చెప్పాడు.
“ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా కోరేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, సేవించండి.
మీ పూర్వీకులను యెహోవా ఎంతో ప్రేమించాడు. వారి సంతతివారై మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఉండేందుకు ఏర్పరచుకొనే అంతగా ఆయన వారిని ప్రేమించాడు. మరి ఏ ఇతర ప్రజ కాకుండ మిమ్మల్నే ఆయన ఎన్నుకొన్నాడు. మీరు నేటికీ ఆయన ఏర్పరచుకొన్న ప్రజలే.
ఎందుకంటే యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు దేవుడు. ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా దేవుడు. ఆయన అద్భుతమైన మహా శక్తిగల పరాక్రమశాలి. యెహోవాకు ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసుకోడు.
తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సహాయం చేస్తాడు. విధవలకు ఆయన సహాయం చేస్తాడు. మన దేశంలో ఉండే విధేశీయులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారికి భోజనం, బట్టలు యిస్తాడు.
మీ పూర్వికులు ఈజిప్టులోనికి వెళ్లినప్పుడు వారు 70 మంది మాత్రమే. ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందిగా, ఆకాశ నక్షత్రాలు ఎన్నో అంతమందిగా మీ దేవుడైన యెహోవా చేసాడు.