Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

2 Chronicles Chapters

2 Chronicles 36 Verses

1 యెరూషలేములో కొత్త రాజుగా యూదా ప్రజలు యెహోయాహాజును ఎన్నుకొన్నారు. యెహోయాహాజు యోషీయా కుమారుడు.
2 యుదాకు రాజయ్యేనాటికి యెహోయాహాజు ఇరువది మూడేండ్లవాడు. అతడు యెరూషలేములో మూడు నెలలపాటు రాజుగా వున్నాడు.
3 పిమ్మట ఈజిప్టు రాజైన నెకో యెహోయాహాజును బందీగా పట్టుకున్నాడు. నెకో యూదా ప్రజలను రెండువందల మణుగుల (మూడు ముప్పావు టన్నులు) వెండిని, రెండు మణుగుల (డెబ్బదియైదు పౌనులు) బంగారాన్ని అపరాధ రుసుముగా చెల్లించేలా చేశాడు.
4 యెహోయాహాజు సోదరుని యూదా, యెరూషలేములపై నూతన రాజుగా నెకో నియమించాడు. యెహోయాహాజు సోదరుని పేరు ఎల్యాకీము. పిమ్మట ఎల్యాకీముకు నెకో ఒక క్రొత్త పేరు పెట్టాడు. అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టాడు. కాని యెహోయాహాజును నెకో ఈజిప్టుకు తీసికొని వెళ్లాడు.
5 యూదాకు కొత్త రాజయ్యేనాటికి యెహోయాకీము ఇరువదియైదేండ్లవాడు. యెహోవా కోరిన విధంగా యెహోయాకీము ధ ర్మంగా ప్రవర్తించలేదు. దేవుడైన యెహోవా పట్ల అతడు పాపం చేశాడు.
6 బబులోను (బాబిలోనియా) రాజైననెబుకద్నెజరు యూదాపై దండెత్తి వచ్చాడు. అతడు యెహోయాకీమును బందీగాచేసి అతనికి కంచు గొలుసులు తగిలించాడు. తరువాత యెహోయాకీముమును నెబుకద్నెజరు బబులోనుకు తీసికొని వెళ్లాడు.
7 యెహోవా ఆలయం నుండి నెబుకద్నెజరు కొన్ని వస్తువులను దోచుకుపోయాడు. అతడా వస్తువులను బబులోనుకు పట్టుకుపోయి వాటిని తన స్వంత ఇల్లయిన రాజగృహంలో వుంచాడు.
8 యెహోవాయాకీము చేసిన ఇతర విషయాలు, అతడు చేసిన భయంకరమైన పాపాలు, మరియు అతనిని దోషిగా నిరూపించే అతని ప్రతి కార్యం గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. యెహోయాకీము స్థానంలో అతని కుమారుడు యెహోయాకీను కొత్తగా రాజయ్యాడు.
9 యూదాకు రాజయ్యేనాటికి యెహోయాకీను పద్దెనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు రాజుగా వున్నాడు. యెహోవా కోరిన విధంగా అతడు తన కార్యాలను నిర్వర్తించలేదు. యెహోవా పట్ల యెహోయాకీను పాపం చేశాడు.
10 వసంత ఋతువులో యెహోయాకీనును పట్టి తెమ్మని రాజైన నెబకద్నెజరు తన మనుష్యులను పంపాడు. వారు యెహోయాకీనును, యెహోవా ఆలయం నుండి కొన్ని ధనరాసులను బబులోనుకు తెచ్చారు. యూదా, యెరూషలేములకు నూతన రాజుగా సిద్కియాను నెబకద్నెజరు నియమించాడు. సిద్కియా అనువాడు యెహోయాకీనుకు బంధువు.
11 యూదాకు రాజుయ్యేనాటికి సిద్కియా ఇరువైఒక సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పద కొండు సంవత్సరాలు రాజుగా వున్నాడు.
12 యెహోవా కోరినట్లు సిద్కియా ఉత్తమ కార్యాలు చేయలేదు. యెహోవా పట్ల సిద్కియా పాపం చేశాడు. దేవుని ముందు అతడు వినయ విధేయతలు చూపించలేదు. ప్రవక్త యిర్మీయా చెప్పిన విషయాలను పాటించలేదు. యెహోవా సందేశాన్ని యిర్మీయా ప్రవచించాడు.
13 రాజైన నెబుకద్నెజరుపై సిద్కియా తిరుగుబాటు చేశాడు. గతంలో నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియాతో బలవంతంగా నెబుకద్నెజరు ప్రమాణం చేయించాడు. నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియా దేవుని మీద ప్రమాణం చేశాడు. కాని సిద్కియా తన జీవన విధానం మార్చుకొని, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా మాటవిని, ఆయనకు విధేయుడైయుండటానికి నిరాకరించి మొండి వైఖరి దాల్చాడు.
14 యాజకుల నాయకులు, యూదా ప్రజల నాయకులంతా కూడా మరీ ఎక్కువ పాపం చేసి, యెహోవాకు విశ్వాస ఘాతకులయ్యారు. వారు అన్యదేశీయుల చెడు మార్గాన్నే అనుసరించారు. ఆ నాయకులంతా యెహోవా ఆలయాన్ని అపవిత్రపర్చి పాడుచేశారు. యెరూషలేములో ఆలయాన్ని యెహోవా పవి త్రపర్చాడు.
15 తమ పూర్వీకుల దేవుడగు యెహోవా తన ప్రజలను హెచ్చిరించటానికి అనేక పర్యాయములు ప్రవక్తలను పంపినాడు. తన ప్రజలపట్ల, తన ఆలయంపట్ల సానుభూతిగలవాడుగుటచే యెహోవా అలా చేస్తూ వచ్చాడు. యెహోవా తన ప్రజలనుగాని, తన ఆలయాన్నిగాని నాశనం చేయదల్చలేదు.
16 కాని దేవుని యొక్క ప్రజలే దేవుడు పంపిన ప్రవక్తలను ఎగతాళి చేశారు. వారు ప్రవక్తలు చెప్పేదానిని వినలేదు. వారు దేవుని వర్తమానములను అసహ్యించుకున్నారు. ఆఖరికి దేవుడు తన కోపాన్ని ఎంత మాత్రమూ ఆపుకోలేకపోయాడు. దేవుడు తన ప్రజలపట్ల కోపపడ్డాడు. ఆ కోపాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు.
17 అందువల్ల యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను రాజును రప్పించాడు . బబులోను రాజు యువకులను ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, యెరూషలేము ప్రజలమీద ఏమాత్రమం కనికరం చూపలేదు. బబులోను రాజు యువకులను, వృద్ధలను కూడ చంపివేశాడు. అతడు పురుషులను, స్త్రీలను చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపివేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు.
18 ఆలయంలోని వస్తులన్నిటినీ నెబుకద్నెజరు బబులోనుకు పట్టుకుపోయాడు. ఆలయంలోను, రాజువద్ద, రాజు యొక్క అధికారులవద్దగల విలువైన వస్తువులన్నిటినీ అతడు పట్టుకుపోయాడు.
19 నెబుకద్నెజరు, అతని సైన్యం ఆలయాన్ని తగులబెట్టారు. వారు యెరూషలేము గోడను పడగొట్టి రాజుకు, రాజాధికారులకు చెందిన ఇండ్లన్నీ తగులబెట్టారు. ప్రతి విలువైన వస్తువును వారు తీసికొనటం గాని, లేక నాశనం చేయటంగాని చేశారు.
20 చనిపోగా మిగిలిన ప్రజలను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వెళ్లి బానిసలుగా పనిచేయించాడు. పర్షియా రాజ్యం (పారసీకము) బబులోను రాజాన్ని ఓడించేవరకు ఆ ప్రజలు బబులోనులో బానిసలుగా వుండి పోయారు.
21 ప్రవక్తయగు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చెప్పిన విషయాలన్నీ ఆ విధంగా సంభవించాయి. యిర్మీయా ద్వారా యెహోవా యిలా చెప్పినాడు: “ఈ ప్రదేశం డెబ్బది యేండ్లపాటు బంజరు భూమిగా మారిపోతుంది. ప్రజలు సబ్బాతు దినాలను పాటించని కారణాన, దానికి పరిహారంగా ఇది జరుగుతుంది.”
22 పర్షియా (పారసీక) రాజు కోరెషు (సైరస్) పాలన మొదటి సంవత్సరంలో ఈ విధంగా జరిగింది. ప్రవక్తయగు యిర్మీయా ద్వారా యెహోవా ప్రకటించిన విషయాలు ఆయన నిజంగా జరిగేలా చేసినాడు. యెహోవా సైరస్ హృదయాన్ని స్పందింపజేసి, అతనిచే ఒక ఆజ్ఞ వ్రాయించి దూతల ద్వారా తన రాజ్యమంతా ప్రకటింపజేసినాడు:
23 పర్షియా రాజైన కోరెషు తెలియజేయున దేమనగా: ఆకాశమందు ప్రభువైన యెహోవా నన్ను ఈ భూమండలానికంతకు రాజుగా చేసినాడు. యెరూషలేములో ఆయనకొక ఆలయం కట్టించే బాధ్యత నాకు అప్పజెప్పినాడు. దేవుని ప్రజలైన మీరంతా ఇప్పుడు యెరూషలేము వెళ్లటానికి స్వేచ్ఛ కలిగియున్నారు. మీ దేవుడైన యెహోవా మీకు తోడై వుండుగాక.
×

Alert

×