పస్కా పండుగ పూర్తి అయ్యింది. యెరూషలేముకు పండుగ నిమిత్తం వచ్చిన ఇశ్రాయేలీయులు యూదాలో వున్న పట్టణాలకు వెళ్లి, అక్కడ వున్న రాతి విగ్రహాలన్నిటినీ ముక్కలు చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వారు ఈ రాతి విగ్రహాలను ఉపయోగించేవారు. ప్రజలు అషేరా స్తంభాలను కూడా నరికివేశారు. యూదా, బెన్యామీను రాజ్యాలలో వున్న ఉన్నత స్థలాలను, బలిపీఠాలను కూలదోశారు. ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో కూడా ఈ ప్రజలు అదే పని చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వినియెగించే వస్తువులన్నీ నాశనమయ్యే వరకు ప్రజలీపని చేస్తూనే వున్నారు. తరువాత ఇశ్రాయేలీయలంతా తమ తమ పట్టణాలకు వెళ్లిపోయారు. ప్రతి వ్యక్తీ తన ఇంటికి వెళ్లిపోయాడు.
రాజైన హిజ్కియా మళ్లీ యాజకుల, లేవీయుల వంశాలను వారివారి విధులు నిర్వర్తించటానికి ఎంపిక చేశాడు. ప్రతి గుంపుకీ ప్రత్యేకమైన పని నిర్దేశించబడింది. దహనబలులు, సమాధానబలులు యివ్వటానికి కూడ హిజ్కియా మళ్లీ యాజకులను, లేవీయులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు ఆలయంలో సేవ చేసి, దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చేశారు.
దహన బలులుగా అర్పించటానికి హిజ్కియా తన స్వంత జంతువులను కొన్నిటిని ఇచ్చాడు. ఈ దహనబలులు ఉదయ, సాయంకాల సమయాలలోను, వారం చివర సబ్బాతు దినాలలోను (శనివారం), అమావాస్యలందు, మరి ఇతర పండుగ దినాలలోను అర్పించేవారు. ఈ కార్యక్రమమంతా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జరిగింది.
యాజకులకు, లేవీయులకు చెందిన భాగాన్ని వారికి ఇవ్వమని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు హిజ్కియా ఆజ్ఞాపించాడు. తద్వారా యాజకులు, లేవీయులు తమ పూర్తి కాలాన్ని యెహోవా సేవలో, ధర్మశాస్త్రం బోధించేందుకు వినియోగించగలరు.
రాజాజ్ఞ దేశమంతా ప్రచారం చేయబడిన వెంటనే, ఇశ్రాయేలు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. తమ పంటలైన ధాన్యం, ద్రాక్ష, నూనె, తేనె, ఇంకను వారి పొలాల్లో పండిన తదితర పంటల నుండి మొదటి భాగాన్ని విరాళంగా ఇచ్చారు. వారి పంటలో పదవ భాగాన్ని స్వచ్ఛందంగా తీసుకొని వచ్చారు. ఈ సేకరణే చాలా పెద్ద మొత్తమయ్యింది.
యూదా పట్టణాలలో నివసిస్తున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలు కూడా తమ పశుసంపదలో పదవవంతు తెచ్చారు. వారింకా యెహోవా కొరకు విడిగా ఒక చోట నిల్వచేసిన వస్తువులలో పదవవంతు తెచ్చారు. వారీ వస్తువులన్నీ తాము ఆరాధించే దేవుడైన యెహోవా నిమిత్తం తెచ్చారు. వారు తెచ్చిన పదార్థాలు, వస్తువులు అన్నీ రాశులుగా పోశారు.
హిజ్కియా, మరియు ఇతర పెద్దలు వచ్చి ప్రజలు తెచ్చిన వస్తుసంపద రాశులుగా పడివుండటం చూశారు. వారు దేవునికి స్తోత్రం చేసి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను శ్లాఘించారు.
సాదోకు కుటుంబానికి చెందిన ప్రముఖ యాజకుడు అజర్యా రాజైన హిజ్కియాతో యిలా చెప్పాడు: “ప్రజలు ఆలయానికి కానుకలు తేవటం మొదలు పెట్టినప్పటి నుండి తినటానికి మాకు సమృద్ధిగా ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. అంతేగాదు, మా వద్ద ఇంకా అనేక పదార్థాలు మిగిలి వున్నాయి. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించాడు. అందుచే మావద్ద ఇదంతా మిగిలివుంది.”
తరువాత యాజకులు కానుకలను, దశమ భాగాలను, తదితర వస్తువుల్లో యెహోవాకై ప్రత్యేకించబడిన వాటిని తెచ్చారు. అలా సేకరించిన ఆ వస్తుసంపదను ఆలయ గిడ్డంగులలో భద్రపర్చారు. లేవీయుడైన కొనన్యా వీటిపై పర్యవేక్షకుడుగా నియపింపబడ్డాడు. అతని తరువాత అధికారిగా షిమీ నియమితుడయ్యాడు. కొనన్యా సోదరుడే షిమీ.
ప్రజలు దేవునికి ఇచ్చే ఉచిత కానుకల విషయమై శ్రద్ధ తీసుకోనే అధికారి పేరు కోరే. దేవునికి ఇవ్వబడిన కానుకల పంపిణీ విషయంలో ఇతడు శ్రద్ధ తీసుకొంటాడు. దేవునికి ఇవ్వగా పవిత్ర పర్చబడిన ధానాల పంపిణీ విషయంలో కూడా బాధ్యత ఇతనిదే. కోరే తూర్పు ద్వారపాలకుడు. ఇతని తండ్రి లేవీయుడైన ఇమ్నా.
ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా మరియు షెకన్యా అనేవారు కోరేకు సహాయ కులుగా పనిచేశారు. వారంతా యాజకులు నివసించే పట్టణాలలో విశ్వాసపాత్రంగా పనిచేశారు. యాజకులలో ప్రతి వర్గం వారి బంధువులకు సేకరించిన వస్తువులను వారు ఇచ్చేవారు. అవే వస్తువులను మిక్కిలి గొప్పవారికి, అతి పేదవారికి కూడ వారివారి భాగాలను వారు ఇచ్చేవారు.
లేవీయుల వంశ చరిత్రల్లో చేర్చబడిన మూడేండ్లు అంతకు పైబడిన వయస్సుగల మగ పిల్లలకు కూడ సేకరించిన రాశులనుండి వారు భాగాలను పంచిపెట్టేవారు. ఈ మగవారంతా నిత్యం ఆలయానికి వెళ్లి అనుదిన సేవా కార్యక్రమాలలో తమ తమ విధులు నిర్వర్తించవలిసినవారు. లేవీయులో ప్రతి వంశంవారికి ఒక బాధ్యత అప్పగించబడింది.
సేకరించిన వస్తుసంపద నుంచి యాజకులకు తమ భాగం యివ్వబడింది. వారి కుటుంబాల వారీగా వంశ చరిత్రలలో రాయబడిన క్రమంలో ఈ పని జరుపబడింది. సేకరించిన సంపదలో ఇరవైయేండ్లు, అంతకు పైబడిన వయస్సుగల లేవీయులకు వారి వంతు భాగాలు ఇవ్వబడ్డాయి. ఇది వారి వారి బాధ్యతలను బట్టి, వారి వారి కుటుంబాలను బట్టి జరిగింది.
లేవీయుల పసిపిల్లలు, భార్యలు, కుమారులు, కుమార్తెలు సేకరించిన సంపదలో భాగస్వాములయ్యారు. వంశచరిత్రలో వ్రాయబడిన లేవీయులందరికీ యిలా భాగాలు ఇవ్వ బడ్డాయి. లేవీయులు విశ్వాస పాత్రంగా సదా పవిత్రులైవుండి, ప్రభుసేవా పరాయణులైనందువల్ల ఆ విధంగా ఏర్పాటు చేయబడింది.
అహరోను వంశస్థులైన కొంతమంది యాజకులు లేవీయులు నివసిస్తున్న పట్టణాలకు దగ్గర లో కొన్ని పంట భూములు కలిగియున్నారు. ఆ పట్టణాలలో అహరోను సంతతి వారు కూడ కొందరు నివసిస్తున్నారు. అట్టి అహరోను సంతతి వారికి భాగాలు యివ్వటానికి ప్రతి పట్టణంలోను నివసిస్తున్న పురుషులు పేర్ల వారీగా ఎంపిక చేయబడ్డారు. పురుషులు, లేవీయుల వంశ చరిత్రలో వ్రాయబడినవారు సేకరించిన పదార్థాలలో భాగం పొందారు.
తలపెట్టిన ప్రతి పనిలోను, ఆలయంలో సేవకార్యక్రమం పునః ప్రారంభించటంలోను; దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను పాటించటంలోను మరియు అతడు దేవుని అనుసరించటంలోడు అతను విజయం సాధించాడు. హిజ్కియా ఈ పనులన్నీ తన హృదయపూర్వకంగా చేశాడు.