ఇప్పుడు మీకు నాయకత్వం వహించటానికి ఒక రాజు ఉన్నాడు. నేను తల నెరసి ముసలివాడనై పోయాను. నా కుమారులు మీతోనే ఉన్నారు. నా చిన్ననాటి నుంచీ మీకు నేను ఆధిపత్యం వహించాను.
ఇప్పుడు నేను మీ సమక్షంలోనే ఉన్నాను. నేనేదైనా తప్పు చేసివుంటే మీరు నాకు వ్యతిరేకంగా వాటిని దేవునికి, ఆయన ఏర్పరచిన రాజుకు చెప్పండి. నేను ఎవరి ఎద్దునే గాని, గాడిదనే గాని దొంగిలించానా? నేనెవరినైనా భాధించటంగాని, మోసగించటంగాని జరిగిందా? నేనెప్పుడైన డబ్బుగాని, ఒక జత చెప్పులుగాని తప్పుపని చేయటానికి తీసుకున్నానా? ఇటువంటి పనులేవైనా చేసి ఉంటే నేను వాటిని తిరిగి ఇచ్చి తప్పు సరిదిద్దుకుంటాను.”
“యెహోవా, ఆయన ఎంపిక చేసిన రాజు కూడ ఈ రోజు మీరు చెప్పిన దానిని విన్నారు. మీరు నాలో ఏ తప్పూ కనుగొనలేదనే దానికి వారిద్దరూ సాక్షులు” అన్నాడు సమూయేలు. అంతట ప్రజలు, “అవును! ఇది సత్యం” అని చెప్పారు.
“యాకోబు వెళ్లిన తర్వాత ఈజిప్టు ప్రజలు ఆయన వంశీకుల జీవితాన్ని కష్టతరం చేశారు. కావున వారు యెహోవా సహాయం అర్థించారు. వారి మొర ఆలకించిన యెహోవా మోషేను, అహరోనును అక్కడికి పంపించాడు. వారిద్దరూ మీ పూర్వీకులను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి నడిపించారు.
“కానీ మీ పూర్వీకులు వారి దేవుడైన యెహోవాను మర్చిపోయారు. అప్పుడు యెహోవా వారిని హాసోరు పట్టణ సైన్యాధిపతి సీసెరాకు బానిసలయ్యేలా చేశాడు. తరువాత ఫిలిష్తీయులకు, మోయాబు రాజుకు కూడ యెహోవా వారిని బానిసలు కానిచ్చాడు. వారంతా మీ పూర్వీకులకు వ్యతిరేకంగా పోరాడారు.
అయితే మీ పూర్వీకులు సహాయంకోసం యెహోవాకు మొరపెట్టారు. ‘మేము పాపం చేసాము. మేము యెహోవాను విడిచిపెట్టి బయలు, అష్ఠారోతు అనే బూటకపు దేవతలను సేవించాము. అయితే ఇప్పుడు మమ్మల్ని మా శత్రువుల బారినుండి రక్షించు. మేము నిన్ను సేవిస్తాము’ అని చెప్పారు.
“యెరుబ్బయలు (గిద్యోను) బెదానను (బారాకు) యెఫ్తా, సమూయేలును పంపి, మీ చుట్టూ ఉన్న శత్రువులనుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు. మీరు క్షేమంగా జీవిస్తున్నారు.
కానీ అమ్మోనీయుల రాజైన నాహాషు మీమీద యుద్ధానికి రావటం మీరు చుసినప్పుడు, మీకు మీ దేవుడైన యోహోవా రాజుగా ఉన్నప్పటికీ ‘మమ్ము పాలించటానికి మాకు ఒక రాజు కావాలని’ మీరు కోరుకున్నారు!
మీరు యెహోవాను ఘనపరచి, ఆయనను సేవించాలి. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు పోరాడకూడదు. మరియు మీరు, మిమ్మల్ని పాలిస్తున్న రాజు, మీ దేవుడైన యోహోవాను వెంబడించాలి. మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు.
ఇప్పుడు గోధుమ పంట [*గోధుమ పంట ఇది వర్షాలు లేని కాలం] కోతకు వచ్చింది. ఫెళఫెళమనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిపించుమని నేను దేవుని ప్రార్థిస్తాను. అప్పుడు మీరు రాజు కావాలని అడిగి, యెహోవాపట్ల ఎంత పాపం చేశారో మీరే తెలుసుకుంటారు,” అని వివరంగా చెప్పాడు.
అలా చెప్పి, సమూయేలు యెహోవాను ప్రార్థించాడు. అదే రోజున యెహోవా ఉరుములతో కూడిన వర్షం పంపించాడు. దానితో యెహోవా అనిన, సమూయేలు అనిన ప్రజలకు విపరీతమైన భయం ఏర్పడింది.
ప్రజలు సమూయేలుతో, “నీ సేవకులమైన మాకోసం దేవుడైన యెహోవాను ప్రార్థించు. మమ్మల్ని చనిపోనీయవద్దు. మా పాపాల మూటకుతోడు రాజు కావాలని అడిగే దురాచారాన్ని కూడ సంతరించుకున్నాం” అని వాపోయారు.
“అయితే యెహోవా తన ప్రజలను విడిచి పెట్టడు. యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొనేందుకు ఆనందించాడు. అందుచేత తనమంచి పేరుకోసం ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు.
కావున మీ కోసం ప్రార్థన చేయకుండా నేను మాని వేస్తే అది నా తప్పు అవుతుంది. ఒకవేళ నేను అలా మానివేస్తే యెహోవాకు విరుద్ధంగా పాపం చేసినవాణ్ణి అవుతాను. సరైన మంచి జీవన మార్గాన్ని నేను మీకు ప్రబోధిస్తాను.