అది విన్న యెజెబెలు ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్తమానం ఇలా వుంది: “రేపు ఈ పాటికి నీవు ప్రవక్తలను చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధించలేని పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!”
ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయేర్షెబాకు వెళ్లారు. బెయేర్షెబాలో తన నౌకరును ఏలీయా వదిలాడు.
తరువాత ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చని పోవాలని కోరుకున్నాడు. ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, నాకిది చాలు. ఇక నన్ను చనిపోనియ్యండి. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను.”
అందుచేత ఏలీయా లేచి అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్లు నడవగలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం అనబడే హోరేబు పర్వతం వద్దకు వచ్చాడు.
ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!”
అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు.
ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెందుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు.
ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పుందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.”
కావున ఏలీయా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాడు షాపాతు కుమారుడైన ఎలీషాను చూశాడు. ఎలీషా ఎద్దులను కట్టి 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. ఏలీయా వచ్చినప్పుడు ఎలీషా చివరి ఎకరాన్ని దున్నుచుండెను. ఏలీయా సరాసరి ఎలీషా వద్దకు వచ్చాడు. ఏలీయా తన అంగీని తీసి ఎలీషా మీద కప్పాడు.
అప్పుడు ఎలీషా పొలంలోవున్న తన ఎద్దులను వదిలి పెట్టాడు. అతడు పరుగెత్తి ఏలీయా వద్దకు వెళ్లి, “నన్ను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారి వద్ద వీడ్కోలు తీసుకోనీయండి. తరువాత నేను మీతో వస్తాను” అని అన్నాడు. “అది చాలా మంచిది. వెళ్లు. నిన్ను నేనాపను” [*నిన్ను నేనాపను “నీకు నేను ఏమి చేశానని?” లేక “నిన్ను ఏమి చేస్తాను?” అని శబ్దార్థం.] అని ఏలీయా అన్నాడు.
ఎలీషా వెళ్లి తన ఇంటి వారితో ఒక ప్రత్యేకమైన విందారగించాడు. ఎలీషా వెళ్లి తన ఎద్దులను చంపాడు. ఎడ్లకు కట్టిన కాడి కర్రతో నిప్పుచేసి, ఎడ్ల మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ మాంసాన్ని అందరికీ ఇచ్చాడు. వారంతా ఆ మాంసాన్ని తిన్నారు. ఎలీషా తరువాత ఏలీయాను అనుసరించి వెళ్లాడు. ఎలీషా ఏలీయాకు సహాయకుడయ్యాడు.