మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని తండ్రి మనపై ఎంత ప్రేమను కురిపించాడో చూడండి. అవును, మనం దేవుని సంతానమే. ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని కూడా తెలుసుకోవటం లేదు.
ప్రియ మిత్రులారా! మనం ప్రస్తుతానికి దేవుని సంతానం. ఇకముందు ఏ విధంగా ఉంటామో దేవుడు మనకింకా తెలియబరచలేదు. కాని యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనెలా ఉంటాడో చూస్తాము. కనుక మనం కూడా ఆయనలాగే ఉంటామని మనకు తెలుసు.
ఆదినుండి సైతాను పాపాలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల పాపం చేసే ప్రతివ్యక్తి సైతానుకు చెందుతాడు. సైతాను చేస్తున్న పనుల్ని నాశనం చెయ్యటానికే దేవుని కుమారుడు వచ్చాడు.
అదే విధంగా తన సోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంతానం కాదు. నీతిని పాటించనివాడు దేవుని సంతానం కాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సైతాను సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం.
సైతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు.
(19-20) మన హృదయాలు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడు. అన్నీ తెలిసినవాడు కనుక, మనం నోటి మాటలతో కాక క్రియారూపంగా సత్యంతో ప్రేమను చూపుదాం. అలా చేస్తే మనం సత్యానికి చెందిన వాళ్ళమని తెలుసుకొంటాం. పైగా ఆయన సమక్షంలో దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడని, మన హృదయాలకు నచ్చ చెప్పగలుగుతాం.