కాని నాదాబు, అబీహులిద్దరూ తమ తండ్రి కంటె ముందుగానే చనిపోయారు. పైగా నాదాబు, అబీహులకు కుమారులు కలుగలేదు. కావున ఎలియాజరు మరియు ఈతామారులిద్దరూ యాజకులుగా సేవచేశారు.
ఎలియాజరు, ఈతామారు వంశం వారిని దావీదు రెండు గుంపులుగా విభజించాడు. వారి వారి కార్యాలను సక్రమంగా నిర్వహించటానికి వీలుగా దావీదు వారిని రెండు గుంపులుగా ఏర్పాటు చేశాడు. సాదోకు, అహీమెలెకుల సహాయంతో దావీదు ఈ పనిచేశాడు. సాదోకు ఎలియాజరు సంతతివాడు. అహీమెలెకు ఈతామారు సంతతివాడు.
ఈతామారు వంశంలో కంటె ఎలియాజరు సంతతివారిలో ఎక్కువమంది నాయకులున్నారు. ఎలియాజరు సంతతి వారిలో పదహారు మంది నాయకులుండగా, ఈతామారు సంతతివారిలో ఎనిమిది మంది నాయకులు మాత్రమే వున్నారు.
ప్రతి వంశంలో నుండి మనుష్యులు ఎన్నుకోబడ్డారు. వారు చీట్లు వేసి ఎంపిక నిర్వహించారు. పవిత్ర స్థలాన్ని అధీనంలో వుంచుకొనేందుకు కొంత మందిని ఎన్నుకొన్నారు. మరికొంత మంది యాజకులుగా సేవచేయటానికి ఎంపిక చేయబడ్డారు. వీరంతా ఎలియాజరు, ఈతామారు వంశాలలోని వారు.
షెమయా కార్యదర్శి. ఇతడు నెతనేలు కుమారుడు. షెమయా లేవి సంతతివాడు. షెమయా ఆయా సంతతుల వారి పేర్లన్నీ రాశాడు. రాజైన దావీదు ముందు, వారి పెద్దల ముందు అతడు పేర్లు రాశాడు. యాజకుడైన సాదోకు, అహీమెలెకు, యాజకుల కుటుంబాలలో పెద్దలు, ఇతర లేవీయుల పేర్లు వున్నాయి. అబ్యాతారు కుమారుడు అహీమెలెకు. చీట్లు వేసిన ప్రతిసారీ వారొక మనుష్యుని ఎంపిక చేశారు. ఆ మనుష్యుని పేరు షెమయా రాసేవాడు. కావున ఎలియాజరు, ఈతామారు వంశాలలోని మనుష్యుల మధ్య పని విభజన జరిగింది.
ఈ వంశాల వారంతా ఆలయంలో సేవ చేయటానికి ఎంపిక చేయబడ్డారు. ఆలయపు సేవలో అహరోను ఆదేశ సూత్రాలను వారు పాటించారు. ఆ నియమాలను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అహరోనుకు ఇచ్చాడు.
వారంతా ప్రత్యేక కార్యాలు నిర్వహించటానికి ఎంపిక చేయబడ్డారు. యాజకులైన వారి బంధువుల వలెనే వారుకూడ చీట్లు వేశారు. వారు రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకుల, లేవీయుల పెద్దల ముందు చీట్లు వేశారు. వారి వారి పనులకు కేటాయించేటప్పుడు వారి పెద్ద కుటుంబాలకు, చిన్న కుటుంబాలకు ఒకే రీతి చీట్లు వేయబడ్డాయి.