దావీదు ఇలా చెప్పాడు: “ఇరవై నాలుగు వేలమంది లేవీయులు దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆరువేల మంది రక్షక భటులుగాను, న్యాయాధిపతులుగాను వ్యవహరిస్తారు.
నాలుగు వేల మంది లేవీయులు ద్వారపాలకులుగా పనిచేస్తారు. మరి నాలుగు వేలమంది లేవీయులు ఆలయ గాయకులుగా వుంటారు. వారికొరకు నేను ప్రత్యేక వాద్యపరికరాలను సిద్ధం చేశాను. వారా వాద్య విశేషాలను యెహోవాను స్తుతించటానికి వినియోగిస్తారు.”
దావీదు లేవీయులను మూడు వర్గాలుగా విభజించాడు. ఆ మూడు వర్గాలకు లేవీ ముగ్గురు కుమారులు ఆధిపత్యం వహించారు. గెర్షోను, కహాతు, మెరారి అని ఆ ముగ్గురు కుమారుల పేర్లు.
అమ్రాము కుమారుల పేర్లు అహరోను, మోషే. అహరోను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూడబడ్డాడు. అహరోను, అతని సంతతి వారు ఎల్లకాలమూ ప్రత్యేకమైన వ్యక్తులుగానే ఎంపిక చేయబడ్డారు. వారు శాశ్వత ప్రాతిపదికపై యాజకులుగా వుండటానికి ప్రత్యేకింపబడ్డారు. అందువల్లనే వారు శాశ్వతంగా వేరుచేయబడ్డారు. అహరోను, అతని సంతతి వారు యెహోవా ముందు ధూపం వేయటానికి నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. ఎల్లకాలమూ యెహోవా పేరుమీద వారు ప్రజలను ఆశీర్వదించటానికి ఎంపిక చేయబడ్డారు.
ఎలియాజరు కుమారులు లేకుండగనే మరణించాడు. అతనికి కేవలం కుమార్తెలు మాత్రం వున్నారు. ఎలియాజరు కుమార్తెలు తమ బంధువులనే వివాహమాడారు. కీషు కుమారులు వారి బంధువులు.
లేవి సంతతివారు వారి వారి వంశకర్తలననుసరించి లెక్కింపబడ్డారు. వారు తమ తమ కుటుంబాలకు పెద్దలు. ప్రతి ఒక్కని పేరు పట్టికలో రాయబడింది. అలా ఎంచబడిన వారిలో ఇరవై ఏండ్లవారు, అంతకు పైబడిన వయస్సువారు వున్నారు. వారు దేవాలయంలో సేవ చేశారు.
అహరోను సంతతివారికి లేవీయులు ఆలయంలో యెహోవా సేవలో తోడ్పడేవారు. వారు ఆలయ ఆవరణ, పక్క గదుల పరిశుభ్రత విషయంలో కూడ శ్రద్ధ తీసుకొనేవారు. అన్ని పవిత్ర వస్తువులను అపవిత్రపడకుండ చూసేవారు. ఆ విధంగా దేవాలయంలో సేవ చేయటం వారి పని.
ప్రత్యేకంగా తయారుచేసిన రొట్టెను అర్పణగా ఆలయంలో బల్ల మీద వుంచటం వారి బాధ్యత. పిండి తయారు చేయటం, ధాన్యార్పణను చెల్లించటం, పులియనిరొట్టె తయారుచేయటం కూడ వారి బాధ్యత. రొట్టెలుచేసే పెనాలు, రకరకాల కలగలుపు అర్పణల విషయంలో వారు శ్రద్ధ తీసుకొనేవారు. ఆయా ద్రవ్యాల కొలతల విషయంలో కూడ వారు జాగ్రత్త తీసుకొనే వారు.
ప్రత్యేక విశ్రాంతి దినాలలోను, అమావాస్య విందుల సమయంలోను మరియు ప్రత్యేక సెలవు దినాలలోను లేవీయులు యెహోవాకి దహన బలులు సమర్పించే వారు. వారు నిత్యం యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు. ప్రతిసారీ ఎంతమంది లేవీయులు సేవ చేయాలి అనే విషయంలో వారికి ప్రత్యేక నియమాలుండేవి.
కావున తాము ఏఏ పనులు చేయాలో అవన్నీ లేవీయులు నిర్వహించేవారు. వారు పవిత్ర గుడారం, పవిత్ర స్థలాల విషయంలో కూడ వారు తగిన జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆ విధంగా వారి బంధువులగు అహరోను వంశీయులకు వారు సహాయపడ్డారు. అహరోను సంతతివారెవరనగా యాజకులు, ప్రధాన యాజకులు. ఆలయంలో యెహోవా సేవలో ఈ యాజకులకు లేవీయులు సహాయపడ్డారు.