హదదెజెరు సైన్యంతో కూడ దావీదు యుద్ధం చేశాడు. సోబా రాజు హదదెజెరు. ఆ సైన్యంలో దావీదు హమాతు పట్టణం వరకు యుద్ధం నిర్వహించాడు. దావీదు అలా ఎందుకు యుద్ధం చేశాడనగా హదదెజెరు తన సామ్రాజ్యాన్ని యూఫ్రటీసు నదివరకు విస్తరింపచేయటానికి ప్రయత్నించాడు.
హదదెజెరుకు చెందిన వెయ్యి రథాలను, ఏడువేల రథసారధులను, ఇరవైవేల మంది కాల్బలాన్ని దావీదు వశపర్చుకున్నాడు. హదదెజెరుకు చెందిన రథాల గుర్రాలలో చాలా వాటి కాళ్లను దావీదు విరుగగొట్టాడు. కాని వందరథాలను లాగటానికి కావలసినన్ని మంచి గుర్రాలను మాత్రం దావీదు రక్షించాడు.
దమస్కు నగరంలోని అరామీయులు (సిరియనులు) హదదెజెరుకు సహాయపడే నిమిత్తం వచ్చారు. హదదెజెరు సోబారాజు. కాని దావీదు వారిని ఓడించి ఇరవై రెండు వేల సిరియను సైనికులను చంపివేశాడు.
తరువాత దావీదు అరాము దేశంలోగల దమస్కు నగరంలో తన సైనిక స్థావరాలు నెలకొల్పాడు. అరామీయులు దావీదుకు సేవకులై కప్పం చెల్లించారు. ఆ విధంగా దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయాన్ని చేకూర్చాడు.
తెబహు (టిబ్హతు), కూను పట్టణాల నుండి దావీదు చాలా కంచును పట్టుకువచ్చాడు. ఈ పట్టణాలు హదదెజెరుకు చెందినవి. తరువాత కాలంలో లోహాన్నే సొలొమోను ఆలయానికి, కంచు సముద్రం, కంచు స్తంభాలు, ఇతర వస్తు సామగ్రి చేయటానికి వినియోగించాడు.
తోహూ తన కుమారుడైన హదోరమును రాజైన దావీదు వద్దకు తాను శాంతి కోరుతున్నట్లు, తనను దీవించమని అడగటానికి పంపాడు. హదదెజెరుతో దావీదు యుద్ధం చేసి అతనిని ఓడించిన సందర్భంగా తోహూ ఇది చేసాడు. ఇంతకు ముందు తోహూ కూడ హదదెజెరుతో యుద్ధం చేసియున్నాడు. హదోరము తనతో వెండి, బంగారం, కంచు లోహాలతో చేసిన రకరకాల వస్తువులు దావీదుకు కానుకలుగా తీసుకొని వెళ్లి ఇచ్చాడు.
రాజైన దావీదు ఆ వస్తువులన్నిటినీ పవిత్రపరచి యెహోవాకు సమర్పించాడు. పైగా ఎదోము, మోయాబుల నుండి, అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయులనుండి, అమాలేకీయుల నుండి తెచ్చిన వెండి బంగారాలను కూడ దావీదు యెహోవాకి సమర్పించాడు.
ఎదోములో అబీషై సైనిక స్థావరాలు కూడ ఏర్పాటు చేసాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.
కెరేతీయులకు, పెలేతీయులకు (రాజు అంగరక్షకులు) నాయకుడుగా బెనాయా నియమితుడయ్యాడు. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. దావీదు కుమారులు ముఖ్యవ్యక్తులై దావీదు రాజుకు సహాయకులుగా వున్నారు.