పిమ్మట దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపర్చాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “మీ అందరికీ ఇది మంచిదనిపించితే, ఇది యెహోవా సంకల్పమే అయితే మనం ఇప్పుడు ఇశ్రాయేలులో మన సోదరులందరికీ ఒక వర్తమానం పంపుదాము. ఈ వర్తమానాన్ని మన సోదరులతో పాటు వారి పట్టణాలలోను, పొలాలలోను నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు కూడ అందజేద్దాము. వారందరినీ వచ్చి మనల్ని కలవమని వర్తమానం పంపండి.
కావున ఈజిప్టులోని షీహోరు నది మొదలు లెబో హమాతు పట్టణం వరకుగల ఇశ్రాయేలీయు లందరినీ దావీదు సమావేశపర్చాడు. ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము పట్టణం నుండి తిరిగి తెచ్చే నిమిత్తం వారంతా ఒక చోటికి పిలవబడ్డారు.
దావీదు మరియు అతనితో వున్న ఇశ్రాయేలీయులు కలిసి యూదాలోని బాలా పట్టణానికి వెళ్లారు. (బాలా అనేది కిర్యత్యారీముకు మరో పేరు.) ఒడంబడిక పెట్టెను బయటకు తేవటానికి వారక్కడికి వెళ్లారు. ఒడంబడిక పెట్టె అనేది యెహోవా దేవుని పవిత్రపెట్టె. యెహోవా కెరూబుల మధ్య ఆసీనుడై వుంటాడు. ఈ పెట్టె యెహోవా పేరుతో పిలవబడుతుంది.
దావీదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముందు తమ శక్తికొలది భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేస్తున్నారు. వారు భక్తిగీతాలు పాడుతూ, తంబర, సితారాలను వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, మద్దెలలు వాయిస్తూ, బూరలు ఊదుతూ వేడుక చేస్తున్నారు.
వారు కీదోను నూర్పిడి కళ్ళం వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే బండిని లాగే ఎద్దులు కాళ్లు జారి తడబడ్డాయి. దానితో బండిమీద ఉన్న ఒడంబడిక పెట్టె ఇంచుమించు క్రిందపడినంత పని అయ్యింది. అప్పుడు ఉజ్జా తనచేయి చాపి పెట్టెను పట్టుకోబోయాడు.
ఉజ్జా పట్ల యెహోవా కోపగించినందుకు దావీదు కలత చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ ప్రదేశం “పెరెజ్ ఉజ్జా” [*పెరెజ్ ఉజ్జా నాశనమైన చోటు అని దీని అర్థం.] అని పిలవబడుతూ వుంది.