ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట... సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా
ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెనుమేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితివిు; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.
కాబట్టి యీ పని ధర్మ శాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.
ఎజ్రా దేవుని మందిరము ఎదుటనుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యోహానానుయొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి, చెరపట్టబడినవారి అపరాధమును బట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయ కుండెను.
మరియు మూడు దినములలోగా ప్రధానులును పెద్దలును చేసిన యోచనచొప్పున ఎవడైనను రాకపోయినయెడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందినవారి సమాజములోనుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి.
యూదా వంశస్థులందరును బెన్యామీనీయు లందరును ఆ మూడు దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమి్మదవ నెల; ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి.
కాబట్టి యిప్పుడు మీ పితరులయొక్క దేవుడైన యెహోవా యెదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసార ముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి.
అయితే జనులు అనేకులై యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువ లేము, ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు; ఈ విషయములో అనేకులము అపరాధులము; కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను,
మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లిచేసికొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను; మరియు ప్రతి పట్టణముయొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతినిబట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండ తొలగి పోవునట్లుగా వారితోకూడ రావలెను అనిచెప్పెను.
అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణ యింప బడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి.
చెరనుండి విడుదలనొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులును వారి పితరుల యింటి పేరు లనుబట్టి తమ తమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి, పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి.