అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధ పరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికి పోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.
మరియు ప్రతి దినము నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱపిల్లను దహన బలిగా అర్పింపవలెను; అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన యెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము.
అయితే అతడు తన పని వారిలో ఎవని కైనను భూమి ఇచ్చినయెడల విడు దల సంవత్సరమువరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరల వచ్చును; అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు.
జనులు తమ స్వాస్థ్యము ననుభ వింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను.
పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడమార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కున స్థలమొకటి కనబడెను.