మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించు కొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు కూర్చుని యుండెను.
రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను.
రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడు నని చెప్పగా
రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయు ననెను.
తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగాచేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను.
మరియు అతడురాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు,రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను.
అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరునుఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దెకై ఉరితీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.