మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు, అతడు నిరపరాధులను హతముచేయుటను బట్టియు, యూదావారు యెహోవా సముఖమునుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞవలన ఇది వారిమీదికి వచ్చెను.
బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తురాజు వశముననున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను.
అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతు లును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.
అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరును లేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొని పోయెను.
ఏడు వేలమంది పరాక్రమ శాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధ మందు తేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను.