ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా
అతని బల్లమీదనున్న భోజనద్రవ్య ములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై
అయి నను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్ప బడలేదని యిప్పుడు నేను తెలిసి కొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించి యున్నవి;
నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రా యేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగిం చుటకు ఆయన నిన్ను నియమించెను అనెను.
మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగార మును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.
ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు.
సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినదిపోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశ మునకు తిరిగి వెళ్లిరి.
మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడువందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.
ఏర్పాటైన ప్రతిమనిషి వెండివస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.
వారు ఐగుప్తులోనుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరు వందల తులముల వెండియు, గుఱ్ఱమొకటింటికి నూట ఏబది తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజు లందరికొరకును అరాము రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.