తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను.
హదరెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులో నుండియు, కూనులోనుండియు దావీదు బహు విస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువు లను చేయించెను.
హదరెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదరెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములుపలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.
ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్దనుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.