అన్నీ తినే వ్యక్తి అలా చెయ్యని వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా అన్నీ తినని వాడు, తినేవాణ్ణి విమర్శించకూడదు. అతణ్ణి కూడా దేవుడు అంగీకరించాడు కదా.
ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు.
ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్యమైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని సమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడూ తాను పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి.
ఒక రోజును ప్రత్యేకంగా భావించే వాడు ప్రభువు పట్ల అలా చేస్తాడు. మాంసాన్ని తినేవాడు తినటానికి ముందు దేవునికి కృతజ్ఞతలు చెపుతాడు. కనుక అతనికి ప్రభువు పట్ల విశ్వాసం ఉందన్నమాట. తినని వాడు కూడా ప్రభువుకు కృతజ్ఞతలు చెపుతాడు కనుక అతనికి కూడా ప్రభువు పట్ల విశ్వాసము ఉందన్నమాట.
ఇక ఇదిగో నీవు! నీ సోదరునిపై ఎందుకు తీర్పు చెపుతున్నావు. మరి మీలో కొందరెందుకు మీ సోదరుని పట్ల చిన్న చూపు చూస్తున్నారు? మనమంతా ఒక రోజు దేవుని సింహాసనం ముందు నిలబడతాము.
దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రభువు ఈ విధంగా అన్నాడు: నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను. నా ముందు అందరూ మోకరిల్లుతారు, దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది.” యెషయా 45:23
నీవు తినే ఆహారం వల్ల నీ సోదరునికి దుఃఖం కలిగితే నీవు ప్రేమగా ఉండటం మానుకొన్నావన్న మాట. నీ ఆహారం కారణంగా నీ సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతని కోసం క్రీస్తు మరణించాడు.
అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయం. తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను నిందించుకోని వ్యక్తి ధన్యుడు.