Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

Psalms Chapters

Psalms 107 Verses

1 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ప్రేమ శాశ్వతం.
2 యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి. వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
3 అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు. తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.
4 ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు. వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుతున్నారు. కానీ వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు.
5 ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి బలహీనం అయ్యారు.
6 అప్పుడు వారు సహాయం కోసం యెహోవాకు ఏడ్చి, మొరపెట్టి వేడుకొన్నారు. యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు.
7 ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
8 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి! ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
9 దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు.
10 దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో కటకటాల వెనుక ఖైదీలుగా ఉన్నారు.
11 ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు. సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు.
12 ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు. వారు తొట్రిల్లి, పడిపోయారు. మరి వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయారు.
13 ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు. వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు.
14 దేవుడు వాళ్లను వారి కటిక చీకటి కారాగారాలనుండి బయటకు రప్పించాడు. మరియు వారు బంధించబడిన తాళ్లను దేవుడు తెంచివేసాడు.
15 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజలకోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
16 దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయుము. వారి ఇత్తడి తలుపులను దేవుడు పగులగొట్టగలడు. వారి ద్వారాల మీది ఇనుప గడియలను దేవుడు చితకగొట్టగలడు.
17 కొందరు ప్రజలు తమ తిరుగూబాటు మార్గాల ద్వారా తెలివితక్కువ వాళ్లయ్యారు. మరియు వారి పాపాలవల్ల కష్టాన్ని అనుభవించారు.
18 ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు, వారు చావుకు సమీపించారు.
19 వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. యెహోవా వారిని వారి కష్టాల నుండి రక్షించాడు.
20 దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు. కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు.
21 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
22 యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయనకు బలులు అర్పించండి. యెహోవా చేసిన పనులను గూర్చి సంతోషంగా చెప్పండి.
23 కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం చేశారు. వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు.
24 ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు. సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు.
25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది. అలలు అంతకంతకు పెద్దవయ్యాయి.
26 అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి. తుఫాను మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు ధైర్యాన్ని కోల్పోయారు.
27 ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడి పోతున్నారు. నావికులుగా వారి నైపుణ్యం నిష్ప్రయోజనం.
28 వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు. మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు.
29 దేవుడు తుఫానును ఆపివేసి, అలలను నెమ్మది పర్చాడు.
30 సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు. వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు.
31 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
32 మహా సమాజంలో యెహోవాను స్తుతించండి. పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.
33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు. నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికి మాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు. ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు. ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు. ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు. వారికి మంచి పంట వచ్చింది.
38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి. వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు. బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు. ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు. కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే అతడు ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు. ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.
×

Alert

×