ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును [*40 ఎదోము యూదారాజ్యానికి ఆగ్నేయంగా ఉన్న దేశం. ఎదోము ప్రజలు ఏశావు సంతతివారు. యాకోబు కవల సోదరుడే ఏశావు. వారు ఇశ్రాయేలీయులకు శత్రువులు.] గురించి ఈ విషయం చెప్పాడు: దేవుడైన యెహోవా నుండి ఒక సమాచారం మేము విన్నాము. వివిధ దేశాలకు ఒక దూత పంపబడ్డాడు. “మనం వెళ్లి ఎదోము మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు.
నీ గర్వం నిన్ను మోసపుచ్చింది. కొండశిఖరం మీద గుహలలో నీవు నివసిస్తున్నావు. నీ ఇల్లు కొండల్లో ఎత్తున ఉంది. అందువల్ల, ‘నన్నెవరూ కిందికి తేలేరు’ అని, నీకు నీవు మనస్సులో అనుకుంటున్నావు.”
నీవు నిశ్చయంగా నాశనమవుతావు! దొంగలు నీవద్దకు వస్తారు! రాత్రి పూట దోపిడిగాండ్రు వస్తారు! ఆ దొంగలు వారికి కావలసినవన్నీ ఎత్తుకు పోతారు? ద్రాక్షాకాయలు ఏరటానికి పనివారు నీ పొలాలకు వచ్చినప్పుడు, వారు కొన్ని పండ్లు వదిలిపెడతారు.
నీ స్నేహితులైన ప్రజలంతా నిన్ను దేశం నుండి పంపివేస్తారు. నీతో సంధి చేసుకొన్నవారు నిన్ను మోసగించి, ఓడిస్తారు. నీ వద్దనే రొట్టెలు తిన్న మనుష్యులు, నిన్ను పట్టటానికి వల పన్నుతున్నారు. వారు ఇలా అంటున్నారు: ‘ఇలా అవుతుందని అతడు అనుమానించడు’ ”
పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకు పోయినప్పుడు ఇశ్రాయేలు శత్రువులతో నీవు చేతులు కలిపావు. పరదేశీయులు ఇశ్రాయేలు నగర ద్వారంలోకి వచ్చి, యెరూషలేములో ఎవరు ఏ భాగాన్ని ఆక్రమించు కోవాలనే దాని విషయంలో చీట్లు వేశారు. ఆ సమయంలో, ఆ వచ్చిన వారిలో నీవొకనిమాదిరిగా ఉన్నావు.
నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు. నీవాపని చేసియుండకూడదు. ఆ జనులు యూదాను నాశనం చేసినప్పుడు నీవు సంతోషించావు. నీవలా చేసియుండకూడదు. యూదా ప్రజల కష్టకాలంలో నీవు గొప్పలు చెప్పుకున్నావు. నీవది చేసియుండ కూడదు.
నా ప్రజల నగరద్వారాన ప్రవేశం చేసి, నీవు వారి సమస్యలను చూసి నవ్వావు. నీవది చేసియుండకూడదు. వారికి కష్టకాలం వచ్చినప్పుడు. నీవు వారి ఆస్తిని దోచుకున్నావు. నీవాపని చేసియుండకూడదు.
నీవు నాలుగు బాటలు కలిసిన స్థానంలో నిలబడి తప్పించుకొని పారిపోయే ప్రజలను చంపివేశావు. నీవాపని చేయకుండా ఉండవలసింది. తప్పించుకునే వారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నావు. నీవాపని చేయకుండా ఉండవలసింది.
యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది. యోసేప [‡యోసేపు ఉత్తర ఇశ్రాయేలుకు ఇది మరొక పేరు.] సంతతివారు మంటలా తయారవుతారు. కాని ఏశావు వంశంబూడిదలా ఉంటుంది. యూదా ప్రజలు ఎదోమీయులను కాల్చివేస్తారు. యూదా ప్రజలు ఎదోమీయులను నాశనం చేస్తారు. అప్పుడు ఏశావు సంతతివారిలో బ్రతికిన వాడంటూ ఏ ఒక్కడూ ఉండడు.” దేవుడైన యెహోవా దాన్ని చెప్పాడు గనుక అది జరుగుతుంది.
యూదాకు దక్షిణాన గల ఎడారి ప్రాంత ప్రజలు ఏశావు కొండను ఆక్రమించుకుని నివసిస్తారు. కొండకింది (మైదాన) ప్రాంతం వారు ఫిలిష్తీయుల దేశాన్ని ఆక్రమిస్తారు. ఆ ప్రజలు ఎఫ్రాయిము, సమరయ (షోమ్రోను) భూములను ఆక్రమించి నివసిస్తారు. గిలాదు దేశం బెన్యామీనుకు చెంది ఉంటుంది.
ఇశ్రాయేలు ప్రజలు వారి ఇండ్లు వదిలి పోయేలా ఒత్తిడి చేయబడ్డారు. కాని ఆ ప్రజలే కనానీయుల దేశాన్ని సారెపతువరకు ఆక్రమిస్తారు. యెరూషలేమునుండి సెఫారాదుకు చెరపట్టబడ్డవారు దక్షిణ ప్రాంత పట్టణాలను ఆక్రమించు కొంటారు.