ఈ నెల పద్నాల్గవ రోజు ఆ నిర్ణీత సమయం. మసక చీకటి వేళ వారు ఆ విందు భోజనం చేయాలి. మరియు విందునుగూర్చి నేను ఇచ్చిన నియమాలన్నింటినీ వారు జ్ఞాపకం ఉంచుకోవాలి.”
“ఒక శవం మూలంగా మేము ‘అపవిత్రులమయ్యాము’ అయితే ఇశ్రాయేలీయుల్లోని ఇతరులతో కలిసి మేము కూడ యెహోవాకు ఈ నిర్ణీత సమయంలో కానుకలు అర్పించటంలోను పస్కా ఆచరించుటలోను యాజకులు అడ్డుకొన్నారు” అని ఆ ప్రజలు మోషేతో చెప్పారు.
“ఇశ్రాయేలీయులతో ఈ విషయాలు చెప్పు, ఒకవేళ సరైన సమయంలో మీరు పస్కాను ఆచరించలేకపోతున్నారేమో. మీరో లేక మీ సంతానంలో వారెవరైనా ఒక శవాన్ని ముట్టినందువల్ల అపవిత్రంగా ఉన్నారేమో. లేదా మీరు ప్రయాణంలో ఉన్నారేమో.
అయితే మీరు కూడ పస్కాను ఆచరించగలరు గాని నిర్ణీత సమయంలో కాదు. రెండవ నెల పద్నాలుగో రోజు సందెవేళ మీరు పస్కాను ఆచరించాలి. ఆ సమయంలో మీరు గొర్రెపిల్లను, పులియని రొట్టెలను, చేదు ఆకుకూరలను తినాలి.
ఆ భోజనంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. మరియు ఎముకలు ఏవీ మీరు విరుగగొట్టకూడదు. మీరు పస్కావిందు భోజనం చేసేటప్పుడు నియమాలన్నింటినీ మీరు పాటించాలి.
అయితే ఆచరించగల ప్రతి మనిషి పస్కావిందును నిర్ణీత సమయంలో తినాలి. అతడు పవిత్రుడై, ప్రయాణంలో లేకుండా ఉండి పస్కాను ఆచరించకపోతే, అతనికి క్షమాపణ లేదు. అతుడు నిర్ణీత సమయంలో పస్కా విందుభోజనం చేయకపోతే, అప్పుడు అతడ్ని తన ప్రజల్లోనుంచి వెళ్లగొట్టి వేయాలి. ఎందుచేతనంటే నిర్ణీత సమయంలో అతడు తన అర్పణను యెహోవాకు అర్పించలేదు గనుక అతడు దోషి.
“ఇశ్రాయేలీయులకు చెందని ఒకడు మీతో నివసిస్తుంటే, అతడు మీతో కలిసి యెహోవా పస్కాలో పాలు పుచ్చుకోవాలనుకోవచ్చు. ఇది అంగీకారమే గాని మీకు ఇవ్వబడిన నియమాలన్నిటినీ అతడు పాటించాలి. మీకోసం ఉన్న నియమాలే మీరు ఇతరులకోసం కూడ పెట్టాలి.” మేఘం – అగ్ని
ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా సాగిపొమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు అలాగే వారు గుడారాలు వేసే స్థలం విషయంకూడా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మేఘం పవిత్రగుడారం మీద నిలిచి ఉండగా, ప్రజలు ఆ చోటనే నివాసం కొనసాగించారు.
కొన్నిసార్లు కొద్ది రోజులవరకు మాత్రమే మేఘం పవిత్ర గుడారంమీద నిలిచేది. ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. మేఘం కదిలినప్పుడు వారు ఆ మేఘాన్ని వెంబడించారు.
కొన్నిసార్లు ఆ మేఘము రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. ఆ మర్నాడు మేఘము కదలగానే, ప్రజలుకూడా వారి సామగ్రి కూర్చుకొని వెంబడించారు. పగలుకాని రాత్రికాని మేఘము కదిలితే అప్పుడు ప్రజలుకూడా బయల్దేరారు.
రెండు రోజులుకానీ, ఒక నెలకానీ, ఒక సంవత్సరంకానీ ఆ మేఘము పవిత్ర గుడారంమీద నిలిచిన కూడ ప్రజలు యెహోవాకు విధేయులవుతూనే ఉన్నారు. తర్వాత మేఘము తన స్థానంనుండి లేచి బయల్దేరితే, ప్రజలు కూడ బయల్దేరారు.
కనుక ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. యెహోవా వారికి చూపించిన చోట వారు గుడారాలు వేసారు. మరల బయల్దేరమని యెహోవా ఆజ్ఞాపించగానే వారు బయల్దేరారు, మేఘాన్ని వెంబడించారు. యెహోవా ఆజ్ఞకు ప్రజలులోబడ్డారు. ఇది మోషే ద్వారా ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ.