“ఇశ్రాయేలు ప్రజలు వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను లేవీ వారికి ఇవ్వవలెనని వారితో చెప్పుము. ఆ పట్టణాలను, వాటి చుట్టూ ఉండే పచ్చిక బయళ్లను ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారికి ఇవ్వవలెను.
మరియు పట్టణానికి తూర్పున 3,000 అడుగులు, పట్టణానికి దక్షిణాన 3,000 అడుగులు, పట్టణానికి పశ్చిమాన 3,000 అడుగులు, పట్టణానికి ఉత్తరాన 3,000 అడుగులు మొత్తం లేవీయులకు చెందుతాయి. ఆ భూమి అంతటికీ మధ్యలో పట్టణం ఉంటుంది,
ఆ పట్టణాల్లో ఆరు ఆశ్రయ పురాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి ప్రమాద వశాత్తూ మరొకర్ని చంపేస్తే, అప్పుడు అతడు ఆశ్రయంకోసం ఆ పట్టణాలకు పారిపోవచ్చు. ఈ ఆరు పట్టణాలు గాక, ఇంకా 42 పట్టణాలను మీరు లేవీయులకు ఇవ్వాలి.
ఇశ్రాయేలీయులలో పెద్ద కుటుంబాలు ఉన్న వారు ఎక్కువ భూభాగాలు ఇవ్వవలెను. ఇశ్రాయేలు చిన్న కుటుంబాలవారు చిన్న భూభాగాలు ఇవ్వవలెను. అయితే అన్ని వంశాల వారూ దేశంలోని వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను మాత్రం తప్పక లేవీవారికి ఇవ్వవలెను.”
ఆశ్రయ పురాలుగా పట్టణాలను మీరు ఏర్పాటుచేయాలి. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ మరో వ్యక్తిని చంపేస్తే, అప్పుడు అతడు భద్రత కోసం ఆ పట్టణాల్లో ఒకదానికి పారిపోవచ్చును.
చనిపోయిన మనిషి కుటుంబంనుండి, దెబ్బకు దెబ్బతీయాలని చూచే వారి బారినుండి అతడు క్షేమంగా ఉంటాడు. అతనికి న్యాయస్థానంలో తీర్పు జరిగేంతవరకు అతడు క్షేమంగా ఉంటాడు.
ఇశ్రాయేలు పౌరులకు, విదేశీయులకు, యాత్రికులకు ఆ పట్టణాలు క్షేమమైన స్థలాలుగా ఉంటాయి. వారిలో ఎవరైనా సరే మరొకర్ని ప్రమాదవశాత్తూ చంపేస్తే వారు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోగలుగుతారు.
(20-21) “ఒక వ్యక్తి మరో వ్యక్తిని చేతితో కొట్టి చంపవచ్చు. లేదా ఒక వ్యక్తి మరొకరిని తోసేసి చంపవచ్చు. లేక ఒక వ్యక్తి మరో వ్యక్తిమీద ఏదైనా విసరడం ద్వారా వానిని చంపవచ్చును. ఆ హంతకుడు ద్వేషంతో అలా చేస్తే అతడు హంతకుడు. ఆ మనిషిని చంపివేయాలి. చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అతనిని తరిమి చంపవచ్చును.
“కానీ ఒక వ్యక్తి మరొకర్ని ప్రమాదవశాత్తూ చంపవచ్చును. అతడు తాను చంపిన వాడిని ద్వేషించలేదు. అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది. లేక ఒక వ్యక్తి మరొకరి మీద ఏదో విసిరినప్పుడు అవతల మనిషి చావవచ్చు — చంపాలని అతడు అలా చేయలేదు.
లేక ఒక వ్యక్తి ఒక బండను విసిరివేయవచ్చును. అతడు చూడని మరో వ్యక్తిమీద ఆ బండపడి, అతనిని చంపవచ్చు. అతుడ ఎవరినీ చంపాలని పథకం వేయలేదు. తాను చంపినవాడిని అతడు ద్వేషించలేదు — అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది.
చనిపోయిన వాని కుటుంబంలో వారు ఎవరైనా తిరిగి అతడిని చంపవచ్చేమో సమాజపు న్యాయస్థానం నిర్ణయించాలి. న్యాయస్థానం హంతుకుడిని బతుకనివ్వాలని ఒకవేళ నిర్ణయిస్తే, అప్పుడు ఈ వ్యక్తి తన ‘ఆశ్రయపురానికి’ వెళ్లాలి. పవిత్ర తైలంతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అతడు అక్కడే ఉండాలి.
(26-27) “ఆ మనిషి తన ‘అశ్రయ పురం’ హద్దులు దాటి ఎన్నడూ బయటకి వెళ్లకూడదు. అతడు ఆ హద్దులు దాటి బయటికి వెళ్తే, చనిపోయినవాని కుటుంబ సభ్యుల్లో ఒకరు అతన్ని పట్టుకొని చంపివేస్తే, అప్పుడు, ఆ సభ్యుని మీద హత్యా నేరం ఉండదు.
“ఒక వ్యక్తి మరొకర్ని చంపి, ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోతే, వాడిని ఇంటికి పోనిచ్చేందుకు డబ్బు తీసుకోవద్దు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండాలి.
“నిరపరాధుల రక్తంతో మీ దేశాన్ని నాశనం కాని వ్వవద్దు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేస్తే, ఆ నేరానికి ఒకే శిక్ష. అది ఆ హంతకుడు చంపబడటమే. ఆ నేరంనుండి దేశాన్ని మరే శిక్షకూడ విమోచించదు.