మొదటి నెల 15వ తేదిన వారు రామెసేసు నుండి బయల్దేరారు. పస్కా మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు జయనినాదాలు చేస్తూ ఈజిప్టునుండి బయటకు వచ్చారు. ఈజిప్టు ప్రజలంతా వారిని చూశారు.
యెహోవా చంపిన తమ వారందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూఉన్నారు. తమ పెద్ద కుమారులందరినీ వారు పాతిపెడ్తూ ఉన్నారు. ఈజిప్టు దేవతల మీద యెహోవా తన తీర్పు తీర్చాడు.
ప్రజలు సీహహీరోతు విడిచి, సముద్రం మధ్య నుంచి నడిచారు. వారు అరణ్యంవైపు వెళ్లారు. అప్పుడు వారు ఏతాము అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసారు. మారా దగ్గర ప్రజలు నివాసం చేసారు.
యాజకుడు అహరోను యెహోవా మాటకు విధేయుడై హోరు కొండ మీదికి వెళ్లాడు. ఆ స్థలంలోనే అహరోను మరణించాడు. ఐదో నెల మొదటి రోజున అహరోను చనిపోయాడు. అది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన 40 వ సంవత్సరం.
అక్కడ మీరు చూసే మనుష్యుల దగ్గరనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. చెక్కబడిన వారి ప్రతిమలను విగ్రహాలను అన్నింటినీ మీరు నాశనం చేయాలి. వారి ఉన్నత స్థలాలు అన్నింటినీ మీరు నాశనం చేయాలి.
మీ కుటుంబాలు ప్రతి ఒక్కదానికీ ఆ దేశంలో భాగం ఉంటుంది. దేశంలోని ఒక్కోభాగం ఏ కుటుంబానికి వస్తుందో తెలుసు కొనేందుకు మీరు చీట్లు వేయాలి. పెద్ద కుటుంబాలకు ఆ దేశంలో పెద్ద భాగం ఇవ్వవలెను. చిన్న కుటుంబాలకు ఆ దేశంలో చిన్న భాగం ఇవ్వవలెను. చీట్లు చేసిన నిర్ణయం ప్రకారమే ప్రజలకు భూమి ఇవ్వబడుతుంది. ప్రతి వంశానికి తమ వంతు భూమి ఇవ్వబడుతుంది.
“ఆ ఇతర మనుష్యులు దేశాన్ని వదలి పోయేటట్టుగా మీరు చేయాలి. ఆ ప్రజలను మీరు దేశంలో ఉండనిస్తే, వారు మీకు ఎన్నో కష్టాలు కలిగిస్తారు. వారు మీ కళ్లలో పొడుచుకొనే ముళ్లలా, పక్కలో ముళ్లుగాను ఉంటారు. మీరు నివసించబోయే దేశానికి వారు చాల కష్టాలు తెస్తారు.