English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Numbers Chapters

Numbers 14 Verses

1 ఆ రాత్రి గుడారాలలో ఉన్న ప్రజలంతా గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టారు.
2 ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. ప్రజలంతా కూడి వచ్చి మోషే, అహరోనులతో ఇలా చెప్పారు, “ఈజిప్టులోనో లేక అరణ్యంలోనో మేము చావాల్సింది. మన కొత్త దేశంలో కత్తిచేత చావటంకంటె అదే బాగుండేది.
3 మమ్మల్ని ఈ కొత్త దేశానికి చావటానికి తీసుకొచ్చాడా? మా భార్యల్ని, మా పిల్లల్ని మా దగ్గరనుండి తీసుకుపోయి మమ్మల్ని కత్తులతో చంపేస్తారు. మేము మళ్లీ ఈజిప్టు వెళ్లి పోవటమే మాకు క్షేమం.”
4 అప్పుడు వాళ్లు, “మనం ఇంకో నాయకుడ్ని ఏర్పాటు చేసుకొని, తిరిగి ఈజిప్టు వెళ్లిపోదాము” అని ఒకళ్లతో ఒకరు చెప్పుకొన్నారు.
5 అప్పుడు అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరి ముందు మోషే, అహరోను సాష్టాంగపడ్డారు.
6 ఆ దేశాన్ని కనుక్కొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు నూను కుమారుడైన యెహోషువ యెపున్నె కుమారుడైన కాలేబు బట్టలు చించుకున్నారు.
7 ఈ ఇద్దరు మనుష్యులూ అక్కడ సమావేశమైన ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పారు: “మేము చూచిన దేశం చాలబాగుంది.
8 మనమీద దేవునికి ఇష్టం ఉంటే, ఆయనే మనల్ని ఆ దేశంలోనికి నడిపిస్తాడు. ఆ దేశం పాలు తేనెలు ప్రవహిస్తున్నంత సౌభాగ్యమయినది. ఆ దేశాన్ని మనకు ఇచ్చేందుకు యెహోవా తన శక్తి ప్రయోగిస్తాడు.
9 అంతేగాని మనం యెహోవాకు ఎదురు తిరుగకూడదు. ఆ దేశంలో ప్రజలకు కూడ మనం భయపడకూడదు. మనం వాళ్లను తేలికగా జయించేస్తాం. వాళ్లకు ఎలాంటి భద్రతా లేదు, వాళ్లను క్షేమంగా ఉంచగలిగింది ఏమి లేదు. కానీ మనకు యెహోవా ఉన్నాడు. అందుచేత ఆ మనుష్యుల్ని గూర్చి భయపడకండి!”
10 అప్పుడు అక్కడ చేరిన ఇశ్రాయేలు ప్రజలంతా వీళ్లిద్దర్నీ రాళ్లతో కొట్టి చంపేయాలని మాట్లాడుకొన్నారు. అయితే యెహోవా మహిమ సన్నిధి గుడారం మీదికి దిగివచ్చింది. ఇశ్రాయేలు ప్రజలంతా అది చూడగలిగారు.
11 అప్పుడు మోషేతో, యోహోవా: “ఇంకా ఎన్నాళ్లు ఈ ప్రజలు ఇలా చేస్తారు? వాళ్లు నన్ను నమ్మటంలేదనే వ్యక్తం చేస్తున్నారు. నా శక్తి మీద వాళ్లకు నమ్మకంలేనట్టే కనబడుతోంది. శక్తివంతమైన ఎన్నో సూచనలు నేను వాళ్లకు చూపించిన తర్వాతకూడ వాళ్లు నన్ను నమ్మటానికి నిరాకరిస్తున్నారు. వాళ్లమధ్య నేను ఎన్నో మహాకార్యాలు చేసాను.
12 ఒక భయంకర రోగంతో వాళ్లందరినీ నేను చంపేస్తాను. వాళ్లను నేను నాశనం చేస్తాను. మరో జనాంగాన్ని తయారు చేసేందుకు నిన్ను నేను వాడు కొంటాను. ఆ జనాంగం ఈ ప్రజలకంటె గొప్పదిగా, బలమైనదిగా ఉంటుంది.” అని అన్నాడు.
13 అప్పుడు యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “నీవు అలాగనుక చేస్తే, నీ ప్రజలందరినీ నీవే చంపేసావని ఈజిప్టు ప్రజలు వింటారు. ఈ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చేందుకు నీవు నీ గొప్ప శక్తిని ప్రయోగించావు.
14 ఈ గొప్ప శక్తినిగూర్చి ఈ దేశ నివాసులందరికీ ఈజిప్టు ప్రజలు చెప్పారు. ఒక యెహోవా, వాళ్లు ఇప్పటికే నిన్నుగూర్చి విన్నారు. నీవు నీ ప్రజలకు తోడుగా ఉన్నావనీ ప్రతి ఒక్కరూ నిన్ను చూసారనీ వారికి తెలుసు. నీ ప్రజలమీద నిలిచే మేఘాన్ని గూర్చి కూడ ఈ దేశవాసులకు తెలుస్తుంది. పగలు నీ ప్రజలను నడిపించేందుకు నీవు ఆ మేఘాన్ని వాడుకొన్నావు. రాత్రిపూట నీ ప్రజలకు నడిపించటానికి తిరిగి ఆ మేఘం అగ్నిగా మారుతుంది.
15 అందుచేత ఇప్పుడు నీవు ఈ ప్రజలను చంపకూడదు. ఒకవేళ నీవు వారిని చంపితే, నీ శక్తిని గూర్చి విన్న దేశాలన్నీ ఏమంటాయంటే
16 ‘యెహోవా ఈ ప్రజలకు వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకుని రాలేకపోయాడు. అందుకని వాళ్లను అరణ్యంలోనే చంపేసాడు అంటారు.’
17 “కనుక యెహోవా, ఇప్పుడు నీ బలం చూపెట్టాలి. నీవు చూపిస్తానని ప్రకటించిన విధానంలో నీవు చూపించాలి.
18 ‘యెహోవా త్వరగా కోపపడడు. ఆయన మహా ప్రేమమూర్తి. యెహోవా పాపాన్ని ఆయనకు ఎదురు తిరిగేవారిని క్షమిస్తాడు. అయితే నేరస్థులను మాత్రం యెహోవా ఎప్పుడూ శిక్షిస్తాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలకుకూడా యెహోవా పిల్లల్ని శిక్షిస్తాడు. వారి తాత ముత్తాతల పాపాలకు యెహోవా పిల్లల్నికూడ శిక్షిస్తాడు’ అని నీవు చెప్పావు.
19 కనుక నీ మహా ప్రేమను ఈ ప్రజలకు చూపించు. వారి పాపం క్షమించు. వారు ఈజిప్టు విడిచినప్పటినుండి నీవు వారిని క్షమించినట్టే ఇప్పుడు కూడా క్షమించు.”
20 యెహోవా జవాబిచ్చాడు: “నీవు అడిగినట్టే నేను ఈ ప్రజలను క్షమించాను.
21 అయితే సత్యం ఏమిటో నీతో చెబుతాను. నేను జీవిస్తున్నంత నిశ్చయంగా, నా శక్తి ఈ భూమి అంతటా ఆవరించినంత నిశ్చయంగా, నేను నీకు ఆ వాగ్దానం చేస్తున్నాను.
22 ఈజిప్టు నుండి నేను బయటకు నడిపించిన ప్రజల్లో ఏ ఒక్కరూ ఆ కనాను దేశాన్ని చూడరు. ఈజిప్టులో నేను చేసిన మహా సూచనలను, నా మహిమను చూసారు ఆ ప్రజలు. అరణ్యంలో నేను చేసిన మహా కార్యాలు వారు చూసారు. అయినా వారు నాకు అవిధేయులై, పదిసార్లు నన్ను శోధించారు.
23 వారి పూర్వీకులకు ఆ గొప్ప దేశాన్ని ఇస్తానని నేను వాగ్ధానం చేసాను. అయితే నాకు ఇలాంటి కీడు చేసిన ఏ వ్యక్తి ఎన్నటికీ ఆ దేశంలో ప్రవేశించడు.
24 కానీ నా సేవకుడైన కాలేబు విషయం వేరు. అతడు పూర్తిగా నన్ను వెంబడిస్తాడు. కనుక అతడు ఇప్పుడు చూసిన ఆ దేశంలోకి అతడ్ని తీసుకొస్తాను. అతని మనుష్యులకు ఆ దేశం దొరుకుతుంది.
25 అమాలేకీ, కనానీ ప్రజలు లోయలో నివసిస్తున్నారు. రేపు ఈ చోటు విడిచి, తిరిగి ఎర్ర సముద్రం మార్గంగా అరణ్యానికి వెళ్లండి.”
26 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు:
27 “ఈ దుర్మార్గులు ఇంకెన్నాళ్లు ఇలా నా మీద ఫిర్యాదు చేస్తుంటారు? వారి ఫిర్యాదులు, సణుగుడు నేను విన్నాను.
28 కనుక వారితో ఇలా చెప్పు, మీరు ఫిర్యాదు చేసిన విషయాలన్నింటినీ యెహోవా తప్పక జరిగిస్తాడు. మీకు ఏమి సంభవిస్తుందంటే,
29 ఈ అరణ్యంలోనే మీ శరీరాలు చచ్చిపడతాయి. మీలో 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లంతా మన ప్రజల్లో సభ్యులుగా లెక్కించబడ్డారు. మీలో ప్రతి ఒక్కరూ, యెహోవానైన నా మీద ఫిర్యాదు చేసారు.
30 మీకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశంలో మీరు ఒక్కరుకూడా ప్రవేశించరు. యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే ఆ దేశంలోని ప్రవేశిస్తారు.
31 మీరు భయపడి, ఆ కొత్త దేశంలో మీ శత్రువులు మీ పిల్లలను మీ దగ్గరనుండి తీసుకుని పోతారని ఫిర్యాదు చేసారు. అయితే ఆ పిల్లల్నే ఆ దేశంలోకి నేను తీసుకుని వస్తానని నేను మీతో చెబుతున్నాను. మీరు అంగీకరించకుండా నిరాకరించిన వాటిని వారు అనుభవిస్తారు.
32 మీ విషయానికొస్తే, మీ శరీరాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి.
33 “మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 సంవత్సరాలపాటు కాపరులుగా ఉంటారు. మీకు విశ్వాసం లేదు గనుక వారు శ్రమపడుతారు. మీరంతా చచ్ఛేంతవరకు వారు ఈ అరణ్యంలోనే ఉండాలి. అప్పుడు మీ అందరి శరీరాలు ఈ అరణ్యంలోనే పడి ఉంటాయి.
34 మీ పాపాలకోసం 40 సంవత్సరాలు మీరు శ్రమ అనుభవిస్తారు. (ఆ దేశాన్ని కనుగొన్న 40 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో సంవత్సరం చొప్పున.) నేను మీకు వ్యతిరేకంగా ఉండటం ఎంతో దారుణంగా ఉంటుందని మీరు తెలుసుకుంటారు.”
35 “నేను యెహోవాను, నేనే మాట్లాడాను. ఈ దుర్మార్గులందరికీ ఇవన్నీ నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వీరంతా కలిసి నామీదికి వచ్చారు. అందుచేత వీళ్లంతా ఇక్కడే అరణ్యంలోనే చస్తారు.”
36 ఆ కొత్త దేశాన్ని కనుగొనేందుకు మోషే పంపిచిన మనుష్యులు తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో ఫిర్యాదులు వ్యాపింప చేసారు. ఈ దేశంలో ప్రవేశించటానికి సరిపడినంత బలంగల వాళ్లం కాదు అని వారే చెప్పారు.
37 ఇశ్రాయేలు ప్రజల్లో కష్టాలు వ్యాపించటానికి వాళ్లే బాధ్యులు. అందుకని వాళ్లందర్నీ చంపేయటానికి ఒక రోగాన్ని రప్పించాడు యెహోవా.
38 అయతే ఆ దేశాన్ని పరిశీలించటానికి పంపబడ్డవాళ్లలో నూను కుమారుడైన యెహోషువ, యెపున్నె కుమారుడైన కాలేబు కూడ ఉన్నారు. యెహోవా వాళ్లిద్దర్నీ రక్షించాడు. మిగతా పదిమందిని చని పోవునట్లు చేసిన రోగం వారికి రాలేదు.
39 ఈ సంగతులన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ప్రజలు చాలా, చాలా విచారించారు.
40 మర్నాడు ఉదయాన్నే ప్రజలు కొండల దేశానికి బయల్దేరారు. ఆ ప్రజలు, “మేము పాపము చేసాము. మేము యోహోవా మీద నమ్మకం ఉంచనందుకు మేము విచారిస్తున్నాము. యెహోవా వాగ్దానం చేసిన దేశానికి మేము వెళ్తాము” అన్నాడు.
41 కానీ మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞకు మీరెందుకు విధేయులవటం లేదు? మీకు జయం కలుగదు.
42 మీరు ఆ దేశం వెళ్లవద్దు. యెహోవా మీకు తోడుగా లేడు. మీ శత్రువులు మిమ్మల్ని తేలికగా ఓడించేస్తారు.
43 అక్కడ అమాలేకీయులు, కనానీయులు మీతో పొరాడుతారు. మీరు యెహోవానుండి వేరైపోయారు. అందుచేత మీరు వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు ఆయన మీకు తోడుగా ఉండడు. మీరంతా వారి ఖడ్గాలతో చంపబడతారు.”
44 కానీ ప్రజలు మోషేను నమ్మలేదు. వారు అలానే ఆ కొండల దేశంవైపు వెళ్లారు. అయితే మోషేగాని, యెహోవా ఒడంబడిక పెట్టెగాని వారితో వెళ్లలేదు.
45 అప్పుడు ఆ కొండల దేశంలో నివసిస్తున్న అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలమీద దాడిచేసారు. అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు తేలికగా వీరిని ఓడించి, హోర్మా వరకు వారిని తరిమికొట్టారు.
×

Alert

×