1
|
యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో |
2
|
“రెండు రోజుల తర్వాత పస్కాపండుగ వస్తొందని మీకు తెలుసు. ఆ తర్వాత మనుష్య కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తత్ఫలితంగా ఆయన శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు” అని అన్నాడు. |
3
|
ప్రధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధాన యాజకుని యింటి ఆవరణంలో సమావేశమై |
4
|
యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు. |
5
|
‘కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు’ అని అనుకొన్నారు. |
6
|
బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు. |
7
|
యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది. |
8
|
ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం? |
9
|
ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు. |
10
|
యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది, |
11
|
పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. |
12
|
ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది. |
13
|
ఇది సత్యం - ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు. |
14
|
ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. |
15
|
“ఆయన్ని మీ కప్పగిస్తే మీరు నాకేమివ్వాలనుకొన్నారు?” అని వాళ్ళనడిగాడు. వాళ్ళు ముప్పై వెండి నాణేలు లెక్క పెట్టి యిచ్చారు. |
16
|
అప్పటినుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. |
17
|
పులియని రొట్టెలు తినే పండుగ రోజులు వచ్చాయి. మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పస్కా పండుగ భోజనం ఎక్కడ సిద్ధం చేయమంటారు?” అని అడిగారు. |
18
|
యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పట్టణంలోకి నేను చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. అతనితో ‘నా సమయం దగ్గరకొచ్చింది. నేను నా శిష్యులతో కలసి పస్కా పండుగ భోజనం మీ యింట్లో చెయ్యాలనుకొంటున్నానని మా ప్రభువు చెప్పమన్నారు’ అని చెప్పండి.” |
19
|
శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కాపండుగ విందు సిద్దం చేసారు. |
20
|
సాయంత్రం కాగానే యేసు పన్నెండు మందితో కలసి భోజనానికి కూర్చున్నాడు. |
21
|
అంతా భోజనం చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. |
22
|
వాళ్ళకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడు ఆయనతో, “ప్రభూ! నేను కాదు కదా!” అని అన్నాడు. |
23
|
యేసు సమాధానం చెబుతూ, “నాతో కలసి గిన్నెలో చెయ్యి ఉంచిన వాడు నాకు ద్రోహం చేస్తాడు. |
24
|
మనుష్యకుమారుడు లేఖనాల్లో వ్రాసినట్లు చనిపోతాడు. కాని ఆయనకు ద్రోహంచేసిన వానికి బహుశ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండక పోయినట్లయితే బాగుండేది” అని అన్నాడు. |
25
|
అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ” అని అన్నాడు. యేసు, “ఔను! నువ్వే!” అని సమాధానం చెప్పాడు. |
26
|
వాళ్ళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది తీసుకొని తినండి! ఇది నా దేహం!” అని అన్నాడు. |
27
|
ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాళ్ళకిస్తూ, “అందరూ ఈ పాత్రలోవున్న దాన్ని త్రాగండి. |
28
|
ఇది నా ఒడంబడిక రక్తం. అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని చిందించాను. |
29
|
ఈ రోజు నుండి నా తండ్రి రాజ్యంలో మీతో కలసి ద్రాక్షారసాన్ని మళ్ళీ త్రాగే దాకా దీన్ని యిక మీదట త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు. |
30
|
వాళ్ళు కీర్తనను పాడాక ఒలీవ చెట్ల కొండ మీదికి వెళ్ళారు |
31
|
ఆ తదుపరి యేసు వాళ్ళతో, “ఈ రాత్రి మీరు నా కారణంగా చెదరిపోతారు. ఎందుకంటే: ‘నేను గొఱ్ఱెల కాపరిని చంపుతాను అప్పుడా గొఱ్ఱెల మంద చెదరిపోతుంది’ అని వ్రాయబడివుంది. జెకర్యా 13:7 |
32
|
“కాని దేవుడు నన్ను బ్రతికించాక నేను మీకన్నా ముందే గలిలయకు వెళ్తాను” అని అన్నాడు. |
33
|
పేతురు, “అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదలి వెళ్ళను” అని సమాధానం చెప్పాడు. |
34
|
యేసు, “ఇది సత్యం. ఈ రాత్రి కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లు అంటావు” అని సమాధానం చెప్పాడు. |
35
|
కాని పేతురు, “నేను మీతో కలసి మరణిస్తాను, కాని మీరెవరో నాకు తెలియదని అనను” అని అన్నాడు. శిష్యులందరూ అదే విధంగా అన్నారు. |
36
|
ఆ తర్వాత యేసు శిష్యులతో కలసి గెత్సేమనే అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళతో, “ఇక్కడే కూర్చోండి. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాను” అని అన్నాడు. |
37
|
యేసు పేతుర్ని, జెబెదయి యొక్క యిద్దరు కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు దుఃఖం వచ్చింది. మనస్సు వ్యాకులం చెందింది. |
38
|
అప్పుడాయన వాళ్ళతో, “నా ఆత్మ మరణ వేదన పొందుతోంది. ఇక్కడే ఉండి నాతో సహా మేలుకొని ఉండండి” అని అన్నాడు. |
39
|
యేసు యింకా కొంత దూరం వెళ్ళి సాష్టాంగపడి, “నా తండ్రి! వీలైతే దుఃఖంతో నిండిన ఈ పాత్రను నా నుండి తీసివేయి! అయినా నెరవేరవలసింది నా యిచ్ఛకాదు. నీది” అని అంటూ ప్రార్థించాడు. |
40
|
ఆ తర్వాత తిరిగి వచ్చి శిష్యులు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయన, “నాతో సహా ఒక గంట సేవు మేలుకోలేక పొయ్యారా?” అని అన్నాడు. |
41
|
“మెలకువగా ఉండి ప్రార్థించండి! అప్పుడే మీరు దుష్ప్రేరేపణకు లోనైపోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది కాని శరీరం బలహీనంగా ఉంది!” అని పేతురుతో అన్నాడు. |
42
|
ఆయన రెండవసారి వెళ్ళి, “నా తండ్రీ! ఈ పాత్రలోవున్నది త్రాగితేగాని వీల్లేదంటే నేను దాన్ని త్రాగుతాను. నీ యిష్టమే నెరవేరు గాక!” అని ప్రార్ధించాడు. |
43
|
ఆయన తిరిగి వచ్చి తన శిష్యులు మళ్ళీ నిద్రిస్తుండటం గమనించాడు. కళ్ళు బరువెక్కటంవల్ల వాళ్ళు నిద్రనాపుకోలేక పోయారు. |
44
|
ఆయన మూడవ సారి వాళ్ళను వదిలి వెళ్ళి ముందు ప్రార్థించినట్లే మళ్ళీ ప్రార్ధించాడు. |
45
|
ఆ తదుపరి తన శిష్యుల దగ్గరకు వచ్చి, “మీరింకా నిద్రిస్తూ, విశ్రాంతి తీసుకొంటున్నారా. చూడండి! మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడే ఘడియ దగ్గరకు వచ్చింది. |
46
|
వెళ్దాం, లేవండి. అదిగో! నాకు ద్రోహం చేయనున్నవాడు వస్తున్నాడు!” అని అన్నాడు. |
47
|
ఆయనింకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ప్రజాప్రముఖులు పంపించిన పెద్ద ప్రజల గుంపు ఒకటి వాని వెంట ఉంది. వాళ్ళ చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. |
48
|
ఆ ద్రోహి, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో, ఆయన్ని బంధించండి!” అని ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు. |
49
|
యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి, “వందనాలు రబ్బీ!” అని ఆయన్ని ముద్దుపెట్టుకున్నాడు. |
50
|
యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని చెయ్యి” అని అన్నాడు. వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు. |
51
|
యేసుతో ఉన్న వాళ్ళలో ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు. |
52
|
యేసు, “కత్తిని వరలో పెట్టెయి! కత్తినెత్తిన వాడు ఆ కత్తితోనే మరణిస్తాడు. |
53
|
నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే పన్నెండు దళాలకంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు. |
54
|
నేను అలాచేస్తే ఈ విధంగా జరగాలని లేఖనాల్లో వ్రాసినవి ఎట్లా నెరవేరుతాయి?” అని అన్నాడు. |
55
|
ఆ తదుపరి యేసు వచ్చిన ప్రజలతో, “దోపిడి దొంగను పట్టుకోవటానికి వచ్చినట్లు కత్తులతో, కర్రలతో వచ్చారేం? మందిరావరణంలో కూర్చొని ప్రతిరోజు బోధించాను. కాని అప్పుడు మీరు నన్ను బంధించలేదు. |
56
|
కాని, ప్రవక్తలు వ్రాసినవి నెరవేరాలని యివన్నీ జరిగాయి” అని అన్నాడు. వెంటనే ఆయన శిష్యులందరూ ఆయన్ని వదిలి వెళ్ళి పొయ్యారు. |
57
|
వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన ‘కయప’ దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై వున్నారు. |
58
|
కాని పేతురు కొంత దూరంలోవుండి యేసును ప్రధానయాజకుని యింటి దాకా అనుసరించాడు. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భటుల్తో కలసి యింటి ముగింట్లో కూర్చున్నాడు. |
59
|
మరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు. |
60
|
0చాలా మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి |
61
|
ఈ విధంగా చెప్పారు, “ఈ వ్యక్తి ‘నేను దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను’ అని అన్నాడు.” |
62
|
అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న నేరారోపణలేమిటి?” అని అడిగాడు. |
63
|
కాని యేసు సమాధానం చెప్పలేదు. ప్రధాన యాజకుడు, “సజీవుడైన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా?” అని అడిగాడు. |
64
|
యేసు సమాధానం చెబుతూ, “ఔను! మీరన్నది నిజం. అంతే. నేను మీతో చెప్పేదేమిటంటే యిక మీదటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిసంపన్నుని కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు. ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు. |
65
|
ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవదూషణ చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? చూడండి అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా! |
66
|
మరి మీరేమంటారు?” అని అడిగాడు. “అతనికి మరణదండన విధించవలసిందే” అని వాళ్ళు సమాధానం చెప్పారు. |
67
|
వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి |
68
|
“ఓ క్రీస్తూ! నిన్నెవరు కొట్టారో చెప్పుకో!” అని అన్నారు. |
69
|
ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, ‘నీవు కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే కదూ!’ అని అడిగింది. |
70
|
కాని అతడు వాళ్ళందరి ముందు, “నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు!” అని అంటూ ఆమె మాటను కాదన్నాడు. |
71
|
ఆ తదుపరి, అతడు అక్కడి నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతణ్ణి మరోదాసీ పిల్ల చూసి, అక్కడున్న ప్రజలతో, “ఈ వ్యక్తి, నజరేతు యేసుతో ఉన్నవాడే!” అని అన్నది. |
72
|
పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” అని అన్నాడు. |
73
|
కొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది!” అని అన్నారు. |
74
|
అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు!” అని అన్నాడు. వెంటనే కోడి కూసింది. |
75
|
అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లంటావు” పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు. |
Matthew 26:60 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...