Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

Lamentations Chapters

Lamentations 3 Verses

1 నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని. యెహోవా కోపపు కర్ర క్రింద నేను సంకట పరిస్థితులు చూశాను.
2 యెహోవా నన్ను చీకటిలోకి నడపించాడేగాని వెలుగులోకి గాదు.
3 యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు. రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు.
4 ఆయన నా మాంసం, నా చర్మం కృశింపజేశాడు. ఆయన నా ఎముకలు విరుగగొట్టాడు.
5 యెహోవా నా పైకి కష్టాలను, వేదనను రప్పించాడు. ఆయన నాచుట్టూ విషాన్ని, సంకట పరిస్థితిని కలుగచేశాడు.
6 ఆయన నన్ను చీకటిలో కూర్చనేలా చేశాడు. ఏనాడో చనిపోయిన వ్యక్తిలా నన్ను ఆయన చేశాడు.
7 యెహోవా నన్ను బయటకు రాకుండా బంధించాడు. ఆయన నాకు బరువైన గొలుసులు తగిలించాడు.
8 సహాయం కొరకు నేను మొర్ర పెట్టుకుని అర్థంచినా, యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు.
9 ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు. ఆయన నా మార్గాన్ని వక్రంగా, గ తుకులమయం చేశాడు.
10 నా మీదకు పడనున్న ఎలుగుబంటిలా యెహోవా ఉన్నాడు. ఆయన పొంచి వున్న ఒక సింహంలా ఉన్నాడు.
11 యెహోవా నన్ను నా మార్గం నుండి తొలగించాడు. ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు. నన్ను నాశనం చేశాడు.
12 ఆయన విల్లంబులు చేపట్టాడు. ఆయన బాణాలకు నన్ను గురి చేశాడు.
13 ఆయన నా పొట్టలో బాణం వేశాడు. ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు.
14 నా ప్రజలందరిలో నేను నవ్వులపాలయ్యాను. రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి చేస్తారు.
15 యెహోవా నాచేత చేదు పానీయం (శిక్ష) తాగించాడు. ఆయన చేదు పానీయాలతో నన్ను నింపివేశాడు.
16 నా పండ్లు రాత్రి నేలలో గుచ్చుకుపోయేలా యెహోవా నన్ను తోశాడు. ఆయన నన్ను మట్టిలోకి తోసివేశాడు.
17 ఇక నాకు శాంతి ఉండదని అనుకున్నాను. మంచి విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను.
18 “యెహోవా తిరగి నాకు సహాయం చేస్తాడనే ఆశ లేదనుకొన్నాను.”
19 ఓ యెహోవా, నా దుఃఖాన్ని, నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము. నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
20 నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను మిక్కిలి విచారిస్తున్నాను.
21 కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది. నేను ఇలా అనుకున్నాను.
22 యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
23 అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
24 “యెహోవా నా దేవుడు. అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను ఆనుకున్నాను.
25 ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు. ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
26 యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచియుండటం క్షేమకరం
27 యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది.
28 యెహోవా తన కాడిని వానిమీద వేయునప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండాలి.
29 ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి. దానివల్ల తన ఆశ నెరవేరునేమో.
30 తనను కొట్టేవానివైపు తన దవడను ఆ వ్యక్తి తిప్పాలి. ఆ వ్యక్తి అవమానాలను భరించటానికి సంసిద్ధుడు కావాలి.
31 యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి.
32 యెహోవా శిక్షించేటప్పుడు, ఆయనకు కరుణకూడ ఉంటుంది. ఆయనకుగల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు.
33 యెహోవా తన ప్రజలను శి క్షింపకోరడు. తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు.
34 యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడడు: ఎవ్వరో ఒక్కరికోసం భూమిపైగల ఖైదీలందరినీ ఆయన పాదాలకింద తొక్కటానికి ఇష్టపడడు.
35 ఒకని మేలుకోసం మరియొకనికి అన్యాయం చేయటం ఆయనకు ఇష్టముండదు. కాని కొంత మంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు.
36 ఒకని మంచి పనిని మరియొకని కోసం పాడు చేయటానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ పనులేవీ చేయటానికి ఇష్టపడడు.
37 యెహోవా ఆజ్ఞలేకుండా ఎవ్వరూ దేనినీ చెప్పలేరు; చెప్పి జరిపించలేరు.
38 మహోన్నతుడైన దేవుని నోటినుండి వరాలు, శాపాలు రెండూ వెలువడతాయి.
39 ఒక వ్యక్తియొక్క పాపాలననుసరించి యెహోవా అతన్ని శిక్షిస్తాడు. కనుక, బతికున్న వాడెవడూ ఆయనపై ఫిర్యాదు చేయలేడు?
40 మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము.
41 పరలోకాధిపతియైన దేవునివైపు మన హృదయాలను, చేతులను చాపుదాము.
42 ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము: “మేము పాపం చేశాము, మొండివైఖరి దాల్చాము. అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు.
43 నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినావు. కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు.
44 నిన్ను నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు. ఏ ఒక్క ప్రార్థనా నీలో ప్రవేశించకుండ నీవలా చేశావు.
45 అన్య దేశాలవారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా, కల్మశంలా చేశావు.
46 మా శత్రువులందరూ మాతో కోపంగా మాట్లాడుతున్నారు.
47 మేము భయానికి గురి అయ్యాము. మేము గోతిలో పడ్డాము. మేము బాధపెట్టబడి, చితుక గొట్టబడ్డాము!”
48 నా కన్నీళ్లు ప్రవాహంలా కారుచున్నాయి! నా ప్రజానాశనం పట్ల నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
49 ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది! నా దుఃఖం ఆగదు.
50 ఓ యెహోవా, నీ దృష్టి మా పై ప్రసాదించి, మమ్మల్ని చూసే వరకు నా దుఃఖం ఆగదు. పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసేవరకు నేను దుఃఖిస్తూనే ఉంటాను.
51 నా నగర కుమార్తెలకు ఏమి జరిగిందో నేను చూసినప్పుడు నా కండ్లు నాకు వేదన కలిగించాయి.
52 తగిన కారణం లేకుండానే నాకు శత్రువులైన వారంతా నన్నొక పక్షిలా తరిమారు.
53 నేను బతికి వుండగానే నన్ను గోతిలోకి తోశారు. నాపై వాళ్లు రాళ్లు విసిరారు.
54 నీళ్లు నా తలపైకి వచ్చాయి. “ఇది నా అంతం” అని నేననుకున్నాను.
55 ఓ యెహోవా, నీ పేరు స్మరించాను. గోతిలో అట్టడుగునుండి నిన్ను పేరుపెట్టి పిలిచాను.
56 నీవు నా మొరాలకించావు. నీవు నీ చెవులు మూసి కొనలేదు. నన్ను కాచి రక్షించటానికి నీవు వెనుకాడలేదు.
57 నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు “భయపడవద్దు,” అని నాకు అభయమిచ్చావు.
58 ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు. నాకు మళ్లీ జీవం పోశావు.
59 ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు. నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు.
60 నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూశావు. వారు నాపై జరిపిన కుట్రలన్నీ నీవు చూశావు.
61 ఓ యెహోవా, వారెలా నన్నవమానించారో నీవు విన్నావు. వారు నాపై జరిపిన కుట్రలన్నిటిని గురించి నీవు విన్నావు.
62 నా శత్రువుల మాటలు, ఆలోచనలు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి.
63 ఓ యెహోవా, వారు కూర్చున్నా, నిలబడినా వారు నన్నెలా ఎగతాళి చేస్తున్నారో చూడు!
64 ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు! వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు!
65 వారి గుండె బండ బారేలా చేయుము! పిమ్మట వారిని శపించుము!
66 కోపంతో వారిని వెంటాడుము! వారిని నాశనం చేయుము. యెహోవా, వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయుము!
×

Alert

×