Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Judges Chapters

Judges 21 Verses

Bible Versions

Books

Judges Chapters

Judges 21 Verses

1 మిస్పా వద్ద ఇశ్రాయేలు మనుష్యులు ఒక ప్రతిజ్ఞ చేశారు. అది ఏదనగా, “బెన్యామీను కుటుంబ వంశంవారికి చెందిన ఏ ఒక్కడూ కూడా ఇశ్రాయేలు వాళ్ల కుమార్తెలను వివాహము చేసుకోనియ్యము.”
2 ఇశ్రాయేలు మనుష్యులు బేతేలు నగరానికి వెళ్లారు. అక్కడ సాయంకాలంవరకు వారు దేవుని ముందు కూర్చొని పెద్దగా ఏడ్చారు.
3 వారు దేవునితో, “యెహోవా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడవు. ఈ భయంకరమైన విషయం మాకెందుకు సంభవించింది? ఎందుకుగాను ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశపు వారు తీసుకు వెళ్లబడ్డారు” అని అడిగారు.
4 ఆ మరుసటి రోజు ఉదయం ఇశ్రాయేలు ప్రజలు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం మీద వారు దహన బలులు, సమాధాన బలులు దేవునికి సమర్పించారు.
5 “యెహోవా సమక్షంలో మమ్మల్ని కలుసుకోవడానికి రాని ఇశ్రాయేలు వంశాలవారెవరైనా ఉన్నారా?” అని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ చేశారు కనుక, వారీ ప్రశ్న అడిగారు. ఇతర ఇశ్రాయేలీయుల వంశముల నుండి మిస్పా నగరం రాకుంటే వారిని హతమార్చుతామని వారు ప్రతిజ్ఞ చేశారు.
6 అప్పుడు బెన్యామీను ప్రజలైన తమ బంధువుల నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలు విచారించారు. వారు ఇలా అన్నారు; “నేడు ఇశ్రాయేలు నుండి ఒక వంశం వేరు చేయబడింది.
7 మేము యెహోవా సమక్షాన ఒక ప్రతిజ్ఞ చేశాము. బెన్యామీను మనుష్యులలో ఎవ్వరినీ మా కుమార్తెలలో ఎవ్వరూ వివాహము చేసుకోరాదని ప్రతిజ్ఞ చేశాము. అందువల్ల బెన్యామీను మనుష్యులకు భార్యలు ఎలా కలుగుతారో మేము నిస్సందేహంగా ఎలా చెప్పగలము? అని అన్నారు.
8 అప్పుడు ఇశ్రాయేలు మనుష్యులు, “ఇశ్రాయేలుకి చెందిన ఏ వంశం వారు మిస్పాకి రాలేదు? మేము దేవుని సమక్షమున ఏకమైనాము. ఒక వంశం ఇక్కడికి రాలేదని మేము అనుకొంటున్నాము” అని అడిగారు. ఆ తర్వాత యాబేష్గీలాదు నగరం నుండి ఎవ్వరూ వచ్చి ఇశ్రాయేలుకి చెందిన ఇతరుల్ని కలుసుకోలేదని వారు కనుగొన్నారు.
9 ఎవరున్నారో, ఎవరు లేరో అని తెలుసుకునేందుకు ఇశ్రాయేలు మనుష్యులు అందరినీ లెక్క పెట్టారు. యాబేష్గీలాదు నుండి ఎవ్వరూ అక్కడ లేరని వారు కనుగొన్నారు.
10 అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు పన్నెండువేల మంది సైనికులను యాబేష్గిలాదు నగరానికి పంపించారు. ఆ సైనికులతో వారు, “యాబేష్గిలాదుకు వెళ్లండి. అక్కడున్న ప్రతి వ్యక్తినీ స్త్రీలను పిల్లలను మీ ఖడ్గాలతో సంహరించండి.
11 మీరు ఇది చెయ్యాలి. యాబేష్గిలాదులో ఉన్న ప్రతి వ్యక్తినీ మీరు చంపాలి. పైగా పురుషునితో సంభోగించిన ప్రతి స్త్రీని కూడా మీరు చంపాలి. కాని పురుషునితో సంభోగము ఎరగని ఏ స్త్రీనీ మీరు చంపకూడదు.” అని చెప్పారు.
12 ఆ పన్నెండువేల మంది సైనికులు యాబేష్గిలాదులో నాలుగువందల మంది యువతులు ఏ పురుషునితోను సంభోగించలేదని తెలుసుకున్నారు. ఆ సైనికులు ఆ యువతులను షిలోహు ప్రాంతానికి తీసుకు వచ్చారు. షిలోహు కనాను ప్రదేశంలో ఉన్నది.
13 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీను వారికి ఒక సందేశం పంపించారు. బెన్యామీను మనుష్యులతో సంధి చేసుకుంటామన్నారు. బెన్యామీను మనుష్యులు రిమ్మోను బండ అనేచోట ఉన్నారు.
14 అందువల్ల బెన్యామీను మనుష్యులు ఇశ్రాయేలుకి తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు యాబేష్గిలాదులో తాము చంపని స్త్రీలను వారికి ఇచ్చారు. కాని బెన్యామీను పురుషులకందరికీ సరిపడ్డ స్త్రీలు లేరు.
15 బెన్యామీను పురుషుల్ని తలచుకుని ఇశ్రాయేలు ప్రజలు విచారించారు. ఇశ్రాయేలుకి చెందిన ఇతర వంశాల నుండి వాళ్లను యెహోవా వేరు చేసినందుకు వారు విచారించారు.
16 ఇశ్రాయేలు ప్రజల నాయకులు ఇలా అన్నారు; “బెన్యామీను వంశానికి చెందిన స్త్రీలు చంపబడ్డారు. ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు మేము భార్యల్ని ఎలా తేగలము?
17 ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు వారి వంశాలు కొనసాగేందుకుగాను పిల్లలు ఉండాలి. ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశం మరణించకుండా ఉండడానికి ఇది చేయబడాలి.
18 కాని మేము మా కుమార్తెలు బెన్యామీను పురుషుల్ని వివాహము చేసుకోనియ్యము. మేము ఈ ప్రతిజ్ఞ చేశాము, ‘ఎవరైనా సరే బెన్యామీను పురుషునికి భార్యనిస్తే, అతనికి చెరుపు కలుగుతుంది.’
19 మాకో ఆలోచన ఉంది. షిలోహు నగరంలో ఇప్పుడు యెహోవాకు ఉత్సవం జరిగే కాలం. అక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవం జరుగుతుంది.” (షిలోహు నగరం బేతేలు నగరానికి ఉత్తరాన ఉంది, బేతేలునుంచి షెకెముకు పోయే బాటకి తూర్పున వుంది. అది లెబోనా నగరానికి దక్షిణాన ఉంది.)
20 అందువల్ల బెన్యామీను మనుష్యులకి పెద్దలు (నాయకులు) తమ ఆలోచన తెలియజేశారు. “వెళ్లండి ద్రాక్షతోటల్లో దాగుకొనండి.
21 ఉత్సవంలో షిలోహునుండి యువతులు వచ్చి నాట్యంలో పాల్గొంటారు. వేచివుండండి. మీరే ద్రాక్షాతోటల్లో దాగి ఉన్నారో, అక్కడినుండి మీరు పారిపోండి. మీలో, ప్రతి ఒక్కడూ షిలోహు నగరానికి చెందిన ఒక యువతిని తీసుకునివెళ్లాలి. ఆ యువతుల్ని బెన్యామీను నగరానికి తీసుకుని వెళ్లండి, వివాహము చేసుకోండి.
22 ఆ యువతుల తండ్రులుగాని సోదరులుగాని వెలుపలికి వచ్చి, మాకు ఇది ఫిర్యాదు చేస్తారు. అప్పుడు, ‘బెన్యామీను పురుషుల ఎడల దయకలిగి ఉండండి. వారు ఆ యువతుల్ని వివాహము చేసుకోనివ్వండి. వారు ఈ స్త్రీలను తీసుకున్నారు. కాని మీతో యుద్ధం చెయ్యలేదు. వారు స్త్రీలను తీసుకువెళ్లారు. అందువల్ల దేవునివద్ద చేసిన ప్రతిజ్ఞ మీరు ఉల్లంఘించలేదు. వారికి ఆ యువతులను ఇచ్చి వివాహము చెయ్యమని మీరు ప్రతిజ్ఞ పట్టారు. బెన్యామీను పురుషులకు మీరా యువతులను యివ్వలేదు. వారు మీ వద్దనుంచే ఆ యువతుల్ని తీసుకువెళ్లారు. అందువల్ల మీరు మీ ప్రతిజ్ఞ తప్పలేదు.”’ అన్నారు.
23 అందువల్ల బెన్యామీను వంశపు మనుష్యులు చేసినది అదే. ఆ యువతులు నాట్యం చేసేటప్పుడు, ప్రతి పురుషుడూ వారిలో ఒక్కరిని పట్టుకున్నాడు. ఆ యువతులను వారు తీసుకుపోయి, వివాహము చేసుకున్నారు. వారు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆ దేశంలో బెన్యామీను మనుష్యులు మళ్లీ నగర నిర్మాణం చేసుకున్నారు, వారా భూమిలోనే నివసించారు.
24 తర్వాత ఇశ్రాయేలు మనుష్యులు ఇళ్లకు వెళ్లిపోయారు. వారు తమ దేశానికి, తమ వంశం వద్దకు వెళ్లారు.
25 ఆ రోజుల్లో ఇశ్రాయేలు మనుష్యులకు రాజు లేడు. అందువల్ల ప్రతి ఒక్కడూ తనకు ఏది సరి అని తోచిందో, అదే చేశాడు.

Judges 21:23 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×