పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదులతో, “యిదిగో చూడండి! అతణ్ణి మీ ముందుకు తెస్తున్నాను. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటంలేదు. ఇది మీరు గ్రహించాలి” అని అన్నాడు.
ప్రధానయాజకులు, అధికారులు యేసును చూడగానే, “సిలువకువెయ్యండి! సిలువకు వెయ్యండి!” అని కేకలు వేసారు. కాని పిలాతు, “మీరే తీసుకు వెళ్ళి సిలువకు వెయ్యండి. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.
ఆ క్షణ నుండి, పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నించాడు. కాని యూదులు, “ఇతణ్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు. తాను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన వాడౌతాడు!” అని కేకలు వేసారు.
కాని వాళ్ళు, “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. సిలువకు వేయండి!” అని కేకలు వేసారు. పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” అని అన్నాడు. ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు” అని సమాధానం చెప్పారు.
యూదుల ప్రధాన యాజకులు దీన్ని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ, “‘యూదుల రాజు’ అని వ్రాసారెందుకు?’ఇతడు, తాను యూదుల రజని అన్నాడు’ అని వ్రాయండి” అని అన్నారు.
భటులు యేసును సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని నాలుగు భాగాలుగా చేసి తలొకటి పంచుకున్నారు. వాళ్ళు ఆయన పొడుగాటి అంగీని కూడా లాక్కున్నారు. అది పైనుండి క్రింది దాకా కుట్టు లేకుండా నేయబడి ఉంది.
ఆ భటులు, “దీన్ని చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో చూద్దాం!” అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అనుకున్నట్లు చేసారు. “వాళ్ళు నా దుస్తుల్ని పంచుకొన్నారు! నా దుస్తుల కోసం చీట్లు వేసారు!” కీర్తన 22:18 అని లేఖనాల్లో వ్రాయబడిన విషయం నిజం కావటానికి యిలా జరిగింది.
అది పండుగకు సిద్దమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు కనుక ఆ రోజు వాళ్ళను సిలువపై వదిలి వేయటం యూదులకు యిష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగ్గొట్టి వారిని క్రిందికి దింపి వెయించుమని పిలాతును అడిగారు.
ఆ తర్వతా ‘అరిమతయియ’ గ్రామానికి చెందిన యోసేపు, యేసు దేహాన్నివ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు. కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకు వెళ్ళాడు.
అతని వెంట ‘నీకొదేము’ కూడా ఉన్నాడు. క్రితంలో ఒక నాటి రాత్రి యేసును కులుసుకున్న వాడు యితడే. ఇతడు ముప్పై అయిదు కిలోలబోళం, అగరుల మిశ్రమాన్ని తన వెంట తీసుకు వచ్చాడు.